జూలై ఒకటి నుంచి నవంబర్ మొదటివారం వరకు ‘వనం-మనం’ : ఏపీ సీఎం బాబు

Spread the love

జూలై ఒకటి నుంచి నవంబర్ మొదటివారం వరకు ‘వనం-మనం’ : ఏపీ సీఎం బాబు

అమరావతి, జూన్ 30 : సమాచార లోపం వల్లే చాపరాయి వంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏమూల ఏం జరిగినా ఎప్పటికప్పుడు సమాచారం అందేలా దృష్టి పెట్టాలని ఆయన అధికారులకు సూచించారు. వైద్య, ఆరోగ్యశాఖ, స్వచ్ఛాంధ్రప్రదేశ్ పై ముఖ్యమంత్రి శుక్రవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. గ్రామీణాభివృద్ది, పట్టణాభివృద్ది, వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. వైఫల్యాలను సరిదిద్దుకోకపోతే కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించారు. అంటువ్యాధుల నియంత్రణపై నిర్లక్ష్యం సహించేదిలేదని స్పష్టం చేశారు. ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం మెరుగు స్థానిక సంస్థల ప్రధాన బాధ్యతని అన్నారు. ప్రజల అమాయకత్వం, సకాలంలో ప్రభుత్వ సేవలు అందక పోవడమే చాపరాయిలో16మంది మృతికి కారణమైందన్నారు. ఇటువంటి ఘటనలు ఇకపై పునరావృతం కారాదని హెచ్చరించారు. తాగునీటి వినియోగం, పారిశుద్ధ్యం,ఆహార అలవాట్లలో ఏజన్సీ ప్రాంత ప్రజలను చైతన్యపరచాలన్నారు. జూలై ఒకటి నుంచి దోమలపై దండయాత్ర కార్యక్రమం ఉత్సాహంగా చేపట్టాలని ఆదేశించారు. తాగునీటి వనరుల పరిశుభ్రం, పారిశుద్ద్యం మెరుగుపర్చడం, మొక్కలు నాటడం ముమ్మరం చేయాలని సూచించారు. వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది ఖాళీలను వెంటనే భర్తీచేయాలని ఆదేశించారు. ఎక్కడికక్కడ నోడల్ అధికారులను నియమించాలి, అన్ని శాఖల అధికారులను సమన్వయం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అన్ని జిల్లాల్లో ప్రతి నెలా హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని.. , నియోజకవర్గ, మండల స్థాయిలో విస్తరించాలని స్పష్టం చేశారు.
మరోవైపు జూలై ఒకటో తేదీ నుంచి నవంబర్ మొదటివారం వరకు ‘వనం-మనం’ కార్యక్రమం ఉత్సాహంగా చేపట్టాలని ముఖ్యమంత్రి అన్నారు. 125రోజుల్లో 25కోట్లమొక్కల నాటడం లక్ష్యంగా నిర్ణయించామని తెలిపారు. జులైలో వనమహోత్సవంతో ప్రారంభించి నవంబర్ లో వన భోజనాలతో దీనిని ముగించాలన్నారు. కాలనీలు, దేవాదాయ భూములు, రెవెన్యూ, ప్రభుత్వ భూముల్లో మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతి శనివారం పాఠశాలల్లో ప్రజారోగ్యంపై డిబేట్లు జరపాలి, నాలుగో శనివారం ప్రజాచైతన్య యాత్రలు నిర్వహించాల న్నారు. విద్యార్ధులు,ఉపాధ్యాయులు,స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు,ఉద్యోగులు దీనిలో భాగస్వాములు కావాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో సెర్ప్, పట్టణాలలో మెప్మా సిబ్బంది క్రియాశీలంగా పనిచేయాలని స్పష్టం చేశారు. సమాజంలో మనం భాగస్వాములం, సమాజం పట్ల మనందరికీ బాధ్యత ఉందని సీఎం వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow