సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించండి : మంత్రి జూపల్లి కృష్ణారావు

Spread the love

హైదరాబాద్- సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురు రవిశంకర్ సంస్థ ప్రతినిధులు మంత్రి జూపల్లి కృష్ణారావును కోరారు. సచివాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్న శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ట్రస్ట్ ఏపీ, తెలంగాణా, తమిళనాడు రాష్ట్రాల ఇంఛార్జీ ఉమా మహేశ్వరి ఆదివారం బేటీ అయ్యారు. సేంద్రీయ వ్యవసాయం, సేంద్రీయ ఎరువుల తయారీలాంటి అంశాల్లో తమ సంస్థ చేపడుతున్న కార్యకలాపాలను ఆమె మంత్రికి వివరించారు. దేశవ్యాప్తంగా ఏపీ సహా 18 రాష్ట్రాల ప్రభుత్వాలతో తమ సంస్థ ఒప్పందం చేసుకుందని… ఆయా రాష్ట్రాల్లో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. దేశవ్యాప్తంగా తాము 15 వందల మంది రైతులకు సేంద్రీయ సాగుపై శిక్షణ ఇచ్చి …వారి ద్వారా శిక్షణ కార్యక్రమాలను, సెమినార్లను నిర్వహిస్తున్నామన్నారు. అలాగే రైతుల వద్దకు స్వయంగా వెళ్లి వారికి సేంద్రీయ వ్యవసాయం, చెత్తాచెదారంతో ఎరువుల తయారీ, గార్బేజ్ ఎంజైమ్ తయారీ లాంటి అంశాల్లో శిక్షణ ఇస్తున్నామన్నారు. వెదురు బొంగులతో తక్కువ వ్యయంతో పాలీ హౌస్లను కూడా నిర్మించుకునేందుకు సహకారం అందిస్తున్నా మన్నారు. నీటి సంరక్షణ, వర్షపు నీటి సద్వినియోగం లాంటి ఎన్నో కార్యక్రమాలను చేపడుతూ…ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పనిచేస్తున్నామని వివరించారు. సేంద్రీయ వ్యవసాయం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే అవకాశాలుంటాయన్నారు. దీనికి సంబంధించి మార్కెటింగ్ పరంగానూ పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామన్నారు. సేంద్రీయ ఆహార పదార్థాలకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉందని.. ఆ దిశగా రైతులకు అవగాహన కల్పించేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు సెర్ప్ సీఈఓ పౌసమి బసుకు తాము చేపడుతున్న కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా వివరించారు. సెర్ప్ ద్వారా ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ సహకారంతో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశాలున్నాయో పరిశీలించాలని సీఈఓ పౌసమి బసుకు మంత్రి సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow