అన్ని అనుభూతుల్ని కేవలం పదినిమిషాల్లో కలిగేలా చేసిన ‘‘అతిథి’’

Spread the love

అన్ని అనుభూతుల్ని కేవలం పదినిమిషాల్లో కలిగేలా చేసిన షార్ట్ ఫిలిమ్ ‘‘అతిథి’’


కొన్ని దృశ్యాలు కన్నీళ్లు పెట్టిస్తాయి. కొన్ని మాటలు హృదయాల్ని బరువెక్కిస్తాయి. మరికొన్ని వాస్తవాలు జీవన చిత్రాన్ని చూపిస్తాయి.. ఇంకొన్ని విషయాలు జీవిత సత్యాన్ని ఆవిష్కరిస్తాయి. ఈ అన్ని అనుభూతుల్ని కేవలం పదినిమిషాల్లో కలిగేలా చేసిన షార్ట్ ఫిలిమ్ ‘‘అతిథి’’. చాయ్ బిస్కట్ వెబ్ సైట్ నుంచి వచ్చిందీ షార్ట్ ఫిలిమ్. అమ్మ ప్రేమను, అమ్మ ఫోన్ ను నిర్లక్ష్యం చేస్తే ఎంతటి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అన్న విషయాన్ని ఎంతో ఆర్ధ్రంగా.. అంతకు మించిన వాస్తవికతతో చెప్పిన ఈ షార్ట్ ఫిలిమ్ చూసి కన్నీళ్లు పెట్టని వారు.. అర్జెంట్ గా అమ్మకు ఫోన్ చేయని వారుండరు. అంతలా కదిలిస్తుందీ షార్ట్ ఫిలిమ్. కలలు కనడంలో తప్పు లేదు. కానీ ఆ కలల్లో విహరిస్తూ కన్నవారిని నిర్లక్ష్యం చేయడం సరికాదు అనే సందేశాన్ని ఎంతో ప్రభావవంతంగా చూపించారు. ఏదో అమ్మగురించి నాలుగు మాటలు చెప్పడం కాకుండా.. ఒక వ్యక్తి ఇప్పుడున్న వయసుకంటే పదేళ్లు ముందుకు వెళితే.. ఆ వ్యక్తి వచ్చి ఇప్పుడు తనతో సంభాషిస్తే.. ఎలా ఉంటుంది అనే ఇంటెలిజెంట్ కాన్సెప్ట్ ఈ షార్ట్ ఫిలిమ్ కు హైలెట్ గా నిలిచింది.

షార్ట్ ఫిలిమ్స్ అనగానే చాలావరకూ రొటీన్ అండ్ బోర్ అనే ఫీల్ వస్తోన్న టైమ్ లో.. సరికొత్త కథ, కథనంతో అతిథి ఆశ్చర్యపరుస్తాడు. నిడివి కూడా కేవలం పదినిమిషాలు మాత్రమే. ఒక్క నటుడు.. రెండే పాత్రలు. పదినిమిషాల పాటు కళ్లు తిప్పుకోకుండా చేసే ప్రతిభావంతమైన నటన. సన్నివేశాన్ని ఎలివేట్ చేసే నేపథ్య సంగీతం.. ఒక్క ఎక్స్ ట్రా షాట్ కూడా లేని ఎడిటింగ్. ఒక్కమాట కూడా అనవసరం అనిపించని డైలాగ్స్.. ఇవన్నీ సింగిల్ లొకేషన్ లో కనిపించిన ఈ షార్ట్ ఫిలిమ్ కు అదనపు బలంగా నిలిచాయి. అందుకే ఈ షార్ట్ ఫిలిమ్ చూసిన వారంతా.. బరువెక్కిన హృదయాలతో కమెంట్ పెడుతున్నారు. ఆశ్చర్యం ఏంటంటే.. యూ ట్యూబ్ లో ఈ షార్ట్ ఫిలిమ్ కు ఒక్కటంటే ఒక్కటి కూడా నెగెటివ్ కమెంట్ లేకపోవడం. అదీ కాన్సెప్ట్ కు ఉన్న బలం. అందుకే అమ్మను గౌరవించే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూసి తీరాల్సిన షార్ట్ ఫిలిమ్ ఇది.
ఇప్పటికే యూ ట్యూబ్ లో ఐదులక్షల వరకూ వ్యూస్ సంపాదించిన అతిథికి సంగీతం కీరవాణి తనయుడు కాలభైరవ అందించాడు. ఇదే అతని ఫస్ట్ ఇండిపెండెంట్ మ్యూజిక్ కూడా కావడం విశేషం. షార్ట్ ఫిలిమ్ కు ఈ స్థాయిలో రెస్పాన్స్ రావడంపై కాలభైరవ స్పందిస్తూ- ‘‘ అతిథి డైరెక్టర్ సందీప్ నాకు చాలాకాలంగా తెలుసు.. ఫేస్ బుక్ లో మేం రెగ్యులర్ గా చాట్ చేసుకుంటుంటాం. సందీప్ నాకు ఈ ఐడియా చెప్పగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. నా ఫస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ అమ్మ సెంటిమెంట్ గా వచ్చిన షార్ట్ ఫిలిమ్ కావడం చాలా హ్యాపీగా ఉంది. నాతో పాటు మా ఫ్యామిలీ కూడా ఈ షార్ట్ ఫిలిమ్ కు వస్తోన్న స్పందన పట్లచాలా హ్యాపీగా ఫీలవుతున్నారు’’ అన్నాడు.
రచయిత, దర్శకుడు సందీప్ మాట్లాడుతూ- ‘‘ఇప్పటి వరకూ చాయ్ బిస్కట్ నుంచి చాలా షార్ట్ ఫిలిమ్స్ చేశాం. అయితే ఈ షార్ట్ ఫిలిమ్ కు వస్తోన్న స్పందన మాత్రం ఊహించనిది. ఈ షార్ట్ ఫిలిమ్ చూసిన తర్వాత యూఎస్ లో ఉంటూ చిన్నగొడవ కారణంగా రెండేళ్లుగా వాళ్ల అమ్మతో మాట్లాడ్డం మానేసిన ఓ అమ్మాయి.. వాళ్ల అమ్మకు ఫోన్ చేసి మాట్లాడానని మెసేజ్ చేసింది. అలాగే యూ ట్యూబ్ లో రెండువేల కమెంట్స్ వచ్చాయి. అన్నీ పాజిటివ్ గా ఉండటం నాకు చాలా బలాన్నిచ్చాయి. ఇకపై కూడా చాయ్ బిస్కట్ నుంచే ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఉంటాను’’ అన్నాడు.
అతిథిలో కలలు కనే కుర్రాడిగా, అతిథిగా డ్యూయొల్ రోల్ చేసిన హీరో సుహాస్ మాట్లాడుతూ- ‘‘ అతిథికి వస్తోన్న రెస్పాన్స్ చాలా సంతోషాన్నిస్తోంది. ఇప్పటి వరకూ కామెడీ షార్ట్ ఫిలిమ్స్ లో నటించాను. కానీ అతిథిలో నా నటనకు ఊహించనన్ని ప్రశంసలు వస్తున్నాయి. అలాగే మా షార్ట్ ఫిలిమ్ పై హీరోలు నాని,సాయి ధరమ్ తేజ్,శర్వానంద్ లతో పాటు చాలా మంది సెలబ్రిటీలు చేసిన ట్వీట్స్ మా ప్రయత్నానికి సపోర్ట్ గా నిలిచాంయి.. ప్రతి ఒక్కరూ ఈ షార్ట్ ఫిలిమ్ చూసి మీ రెస్పాన్స్ తెలియజేయాలని కోరుకుంటున్నా’’ అన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow