కాంగ్రెస్ నేత‌..రాజ్య‌స‌భ స‌భ్యుడు పాల్వాయి హ‌ఠ్మార‌ణం

Spread the love

కాంగ్రెస్ నేత‌..రాజ్య‌స‌భ స‌భ్యుడు పాల్వాయి హ‌ఠ్మార‌ణం

కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కన్నుమూశారు. కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ స్టాండింగ్ కమిటీ సమావేశానికి ఢిల్లీ నుంచి మనాలికి వెళ్లారు. అక్కడే ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స తీసుకుంటూనే తుది శ్వాస విడిచారు పాల్వాయి. ఆయనతోపాటు మరో 10 మంది ఎంపీలు కూడా ఈ సమావేశానికి వెళ్లారు. ఆయన వయస్సు 80 సంవత్సరాలు. 1967లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1972, 1978, 1983, 1999లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2007-09 వరకు ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహించారు. 2012న ఆయన రాజ్యసభకు ఎన్నిక అయ్యారు. 60 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉంది. నెహ్రూ హయాం నుంచి కాంగ్రెస్ పార్టీలోనూ కొనసాగుతున్నారు. నెహ్రు, ఇందిర, రాజీవ్, సోనియా, రాహుల్ గాంధీ వరకు ఐదు తరాలను చూసిన నేత. 1967లో తొలిసారి నల్గొండ జిల్లా మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కమ్యూనిస్ట్ కంచుకోటను బద్దలుకొడుతూ తొలిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొంది.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించారు పాల్వాయి. కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వారి కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు. జి.వెంకటస్వామితో మంచి అనుబంధం ఉంది. వెంకటస్వామి, పాల్వాయి ఇద్దరూ రాష్ట్ర కేబినెట్ లో ఒకేసారి మంత్రి అయ్యారు.

దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన సీఎం కేసీఆర్‌

రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి హఠాన్మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన గోవర్ధన్ రెడ్డి తో తనకు ఉన్న అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. పాల్వాయి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
స్టాండింగ్ కమిటీ సమావేశానికి పాల్వాయి తో పాటు హాజరైన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తో సీఎం మాట్లాడి .. వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాల్వాయి మృత దేహాన్ని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తీసుకు వచ్చేందుకు ప్రభుత్వ పరంగానే అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రధాన కార్యదర్శి s p సింగ్ , ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్ అరవింద్ కుమార్ ను సీఎం ఆదేశించారు. మృత దేహం తరలింపు తో పాటు అవసరమైన అన్ని కార్యక్రమాలను పర్యవేక్షించాలని ఎంపీ లు కె. కేశవ రావు, జితేందర్ రెడ్డి లను సీఎం కోరారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow