వేసవిలో చేపల పెంపకం లో తీసుకోవలసిన జాగ్రత్తలు

Spread the love

వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రత కారణంగా, ఎక్కువ చేపల సాంద్రత ఉండడం, నీరు క్రమేపి తగ్గడం, కరిగియున్న ప్రాణవాయువు కొరత మరియు నీటి నాణ్యత తగ్గిపోయి ఘాడత పెరగడం, మొ కారణాల వలన చేపల తీవ్రమైన ఒత్తిడికి గురి అవుతాయి. కొన్ని సందర్భాలలో పెద్ద మొత్తంలో చేపలు చని పోతు ఉంటాయు. అంతే కాకుండా రోగకారక సూక్ష్మజీవులు వలన వ్యాధులు సంభవించే అవకాశాలు కూడా ఎక్కువ అవుతాయి. కావున ఈ క్రింది జాగ్రత్తలు పాటించిన ఎడల ఎలాంటి ఆర్థిక నష్టం జరగదు.
1. చెరువు లోని నీటి నాణ్యత, లోతు, విస్తీర్ణం మరియు చేపల కదలికలు ప్రతి రోజు గమనిస్తూ ఉండాలి. చెరువులోని కొన్ని చేపలను మచ్చుకు పట్టి వాటి పెరుగుదల, రంగు, తోక మరియు రెక్కల స్వభావము, మొప్పెల రంగు, ఫై జిగురును, మొ|| లక్షణాలను నిశితంగా పరిశీలించాలి. తేడాలు గమనించిన ఎడల, సంబందిత మత్స్య శాఖా అధికారి సలహాలు మరియు సూచనలు తీసుకొని నివారణ మరియు నియంత్రణ చర్యలు సత్వరమే చేపట్టిన ఎడల ఆర్థిక నష్టాన్ని కొంత మేర తగ్గించుకోవచ్చు.

2. ఉదయాన్నే చేపలు చెరువు ఫై భాగాన నోరు తెరచుకొని తిరుగుతూ ఉంటే ప్రాణవాయువు కొరత ఉందని గమనించాలి. అలాంటి సందర్భాలలో చెరువులో నీరు పెట్టటం, ఆది సాధ్యం కాని పక్షంలో పెద్దగా పెరిగిన చేపలను పట్టి అమ్మి వేసుకోవాలి. దీనివలన చేపల సాంద్రత తగ్గడం వలన ప్రాణవాయువు కొరతను అధిగమించవచ్చు. కాని మత్స్యకారులు చేపలు మార్కెట్ సైజు రాలేదనో లేదా మార్కెట్లో రేట్లు తక్కువున్నయనో, ఐస్ దొరకకపోవటం, మొ కారణాల వలన నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు.

3. చెరువులోని నీటి నాణ్యత తగ్గిపోయినప్పుడు సున్నాన్ని ఒక హెక్టారుకు 100 నుండి 250 కేజీల వరకు చెరువులో చల్లిన ఎడల, నీటి నాణ్యత పెరగడమే కాకుండా ప్రాణవాయువు శాతం పెరుగి ఉదజని సూచికను అదుపులో ఉంచును.

4. చెరువులోని కలుపు మొక్కలని ఎప్పటి కప్పుడు తగ్గిస్తూ ఉండాలి లేని ఎడల రాత్రి సమయాలలో అవి కేవలం కార్బన్ డయాక్సైడ్ విడుదల చెయడం వలన చేపలు తీవ్ర ప్రాణవాయువు కొరత వలన ఎక్కువ మొత్తంలో చనిపోతు ఉంటాయి. అలాంటి సందర్భాలలో మత్స్యకారులు ఎవరైన గిట్టని వారు విషం కలిపారని అనుమానిస్తూ ఉంటారు. విషం కలిపినా ఎడల కర్పూ జాతి చేపలే కాకుండా కోర్రమట్ట (మర్రల్), మార్పు, జేల్లలు, మొ తక్కువ ఆక్సిజన్ ను తట్టుకునే చేపలు మరియు కప్పలు, నీటి పాములు కూడా చనిపోవాలి. కనుక అటువంటి అనుమానాలు నిజమా కాదా అని నిర్ధారణ చేసు కోవడం చాల అవసరం.

5. వ్యాధితో చేపలు చనిపోయినప్పుడు వెంటనే చని పోయిన చేపలను తొలగించి చెరువుకు దూరంగా కాల్చివేయాలి లేదా ఒక గోతి తీసి అందులో పూడ్చి వెయ్యాలి. వెంటనే సున్నాన్ని ఒక హెక్టారుకు 100 నుండి 250 మోతాదులో చల్లాలి. ఇంకా అదుపులోకి రాకుంటే నీటి నాణ్యత పెంచే రసాయనాలు అనగా BKC (బెంజాల్ కొలియం క్లోరైడ్) ను ఒక హెక్టారుకు ఒక లీటరు చొప్పున నీటిలో కలిపి చెరువులో చల్లాలి. ఈ చర్యల వలన నీటి నాణ్యత పెరగడమే కాకుండా చేపల ఫై ఉన్న పరాన్న జీవులు చనిపోతాయి. ఇన్ని చేసిన తదుపరి కూడా ఎలాంటి మార్పు లేకపోతే చివరి అస్త్రంగా అంటి బయాటిక్ మందులను సూచించిన మోతాదులో మేతతో పాటు కలిపి ఇవ్వాలి.
6. ప్రాణవాయువు పెంచుకోవడానికి చెరువులోని నీటిని మోటార్ల ద్వారా రీసైక్లింగ్ చేసుకున్న ఎడల విష వాయువులు తగ్గి ప్రాణవాయువు శాతం పెరుగుతుంది. పైన తెలిపిన సందర్బాలలో చేపలను పట్టి వేయడం అత్యంత శ్రేయస్కరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow