విశ్వవిద్యాలయాల్లో అకాడమిక్ వాతావరణం నెలకొల్పాలి : ఉప ముఖ్యమంత్రి

Spread the love
  • విద్యకు, పరిశోధనకు యూనివర్శిటీలను నిలయాలుగా మార్చాలి..సభలు, సమావేశాలు, రాజకీయాలకు చోటివ్వొద్దు
  • డ్రగ్స్, ర్యాగింగ్ కాలేజీల్లో ఉండకుండా అప్రమత్తంగా వ్యవహరించాలి
  • సీసీ కెమెరాలు కాలేజీలు, హాస్టళ్లు, పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి
  • దేశంలో ఉన్నత విద్యలో ఎస్సీల, ఎస్టీల నమోదులో తెలంగాణ మొదటి,రెండు స్థానంలో ఉంది..ఇది మన సంస్కరణల ఫలితం
  • ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాలతో మన విశ్వవిద్యాలయాలు ఒప్పందం కుదుర్చుకోవాలి
  • విశ్వవిద్యాలయాలకు ఇచ్చిన నిధులను సరైన సమయంలో సక్రమంగా వినియోగించాలి
  • అకాడమిక్ ఇయర్ ప్రారంభంలో ప్రభుత్వ ఆలోచనలను వీసీలకు తెలియజేసేందుకే ఈ సమావేశం
  • ల్యాబ్స్, లైబ్రరీలు, వసతులు కల్పించేందుకు విశ్వవిద్యాలయాలకు నిధులిచ్చాం
  • ఖాళీల భర్తీకి సిఎం ఆమోదం తెలిపిన నేపథ్యంలో వాటిని వేగంగా పూర్తి చేయాలి
  • కాంట్రాక్టు లెక్చరర్లపై నివేదిక అందగానే విశ్వవిద్యాలయాల ఖాళీల భర్తీపై నిర్ణయం తీసుకుంటాం
  • తెలంగాణ విశ్వవిద్యాలయాలకు పూర్వవైభవం తీసుకురావాలి
  • నాన్ బోర్డర్లు ఈ నెల 23 పరీక్షల వరకు అనుమతివ్వమని అడిగారు…దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం
  • కొత్త విద్యార్థులకు వసతి కల్పించేందుకే పాత విద్యార్థులను ఖాళీ చేయమని చెబుతున్నాం
  • విశ్వవిద్యాలయాల వీసీల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి

హైదరాబాద్ :  ‘‘ తెలంగాణ విశ్వవిద్యాలయాలను విద్యకు, పరిశోధనకు నిలయాలుగా తీర్చిదిద్దాలి. సభలు, సమావేశాలు, రాజకీయాలకు అక్కడ తావివ్వొద్దు. డ్రగ్స్, ర్యాగింగ్ లకు చోటు ఉండొద్దు. వీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అంతటా సీసీ కెమెరాలు పెట్టాలి. మన యూనివర్శిటీలకు పూర్వ వైభవం తీసుకురావాల్సిన బాధ్యత ఇప్పుడున్న వీసీలు, రిజిస్ట్రార్లదే ’’ అని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు.  విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో తెలంగాణ విశ్వవిద్యాలయాల ఉప కులపతులు, రిజిస్ట్రార్లతో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఈ ఏడాది కార్యాచరణ ప్రణాళికపై నాంపల్లిలోని రూసా బిల్డింగ్ లో సమావేశం నిర్వహించారు.

        విశ్వవిద్యాలయాలను పటిష్టం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ ఏడాదిలో నాలుగుసార్లు వీసీలతో సమావేశం నిర్వహించుకున్నామని ఉఫ ముఖ్యమంత్రి కడియం తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో పరీక్షల నిర్వహణ, నియామకాలు, బోధన సరైన రీతిలో లేకపోతే ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుందని, ఇలాంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ విశ్వవిద్యాలయాలపై చాలా నమ్మకం పెట్టుకుని మీకు బాధ్యతలు అప్పగించారని, అడిగినన్ని నిధులు ఇస్తున్నారని, 1550 పోస్టులను భర్తీ చేయడానికి కూడా ఆమోదం తెలిపారని, వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని బాగా పనిచేయాలని కోరారు. విశ్వవిద్యాలయాల అధిపతులు స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులతో కూడా మంచి సంబంధాలు కొనసాగిస్తూ, వారి సహకారం తీసుకుని యూనివర్శిటీల్లో మంచి వాతావరణ నెలకొల్పాలన్నారు.

        కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఆలిండియా సర్వే ఆన్ హైయర్ ఎడ్యుకేషన్ 2016 సర్వేలో తెలంగాణ రాష్ట్రం దేశంలో ఫలు అంశాల్లో మొదటి స్థానంలో ఉందని, ఇది మన సంస్కరణల ఫలితమని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. దేశంలో 18 నుంచి 23 ఏళ్ల వయస్సున్న విద్యార్థులపై సర్వే చేస్తే, విద్యా సంస్థల్లో ఈ వయోపరిమితి ఉన్న వారి నమోదు శాతం దేశ సగటు 18శాతం ఉండగా, తెలంగాణ సగటు 23 శాతంగా ఉందన్నారు. ఇక ఎస్సీ అభ్యర్థుల నమోదులో తెలంగాణ దేశంలో మొదటి స్థానంలో, ఎస్టీల నమోదులో దేశంలో మన రాష్ట్రం రెండోస్థానంలో ఉండడం శుభ పరిణామమన్నారు. ఈ స్థానాలను కాపాడుకుంటూ మరింత ప్రమాణాలున్న విద్యకు నిలయంగా యూనివర్శిటీలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం మనందరిపై ఉందన్నారు. అయితే ఈ సర్వేలో పరిశోధన అంశంలో తెలంగాణ విశ్వవిద్యాలయాలు కొంత వెనుకబడి ఉన్నట్లు తేలిందని, దీనిని మెరుగుపర్చుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు.

        యూనివర్శిటీల్లో ప్రమాణాలను పెంచుకునేందుకు ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాలతో ఆయా అంశాలపై ఒప్పందం కుదుర్చుకుంటే మన విద్యార్థులకు మేలు జరుగుతుందని, తద్వారా తెలంగాణ యూనివర్శిటీల ప్రతిష్ట కూడా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుందన్నారు. విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పనకోసం ముఖ్యమంత్రి కేసిఆర్ మంజూరు చేసిన 420 కోట్ల రూపాయలను వీలైనంత త్వరగా పొరపాట్లకు తావులేకుండా ఖర్చు చేయాలన్నారు. 1550 పోస్టుల భర్తీకి గౌరవ సిఎం కేసిఆర్ ఆమోదం తెలిపారని, మొదటి దశలో 1061 పోస్టులు భర్తీ చేయడానికి యూనివర్శిటీలకు ఆదేశాలు ఇచ్చామన్నారు. త్వరలోనే కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్దీకరణ, వేతనాల పెంపునకు సంబంధించి నివేదిక వస్తుందని, ఆ తర్వాత వీటిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. యుజిసి నిబంధనల మేరకే భర్తీ చేపడుతామన్నారు. ఇక పి.హెచ్.డీ అడ్మిషన్లలో కూడా ఎలాంటి వార్తలకు తావు ఇవ్వకుండా యుజీసి నిబంధనల మేరకే నడుచుకోవాలన్నారు. అడ్మిషన్ల ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లో జాప్యం చేయవద్దని సూచించారు.

        ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నాన్ బోర్డర్లు ఈ నెల 23వ తేదీ వరకు వివిధ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యేందుకు అవకాశం కల్పించాలని కోరారని, దీనిపై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి కడియం తెలిపారు. కొత్తగా అడ్మిషన్లు తీసుకునే విద్యార్థులకు హాస్టళ్లలో అవకాశం కల్పించేందుకు విద్యా సంవత్సరం పూర్తి చేసుకున్న వారు నాన్ బోర్డర్లుగా ఉండవద్దని కోరుతున్నామన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిశోధనకు పెద్ద పీట వేసి, పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.

        విశ్వవిద్యాలయాల్లో ర్యాగింగ్, డ్రగ్స్ కు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వవద్దని వీసీలు, రిజిస్ట్రార్లకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సూచించారు. విశ్వవిద్యాలయాల్లో కాలేజీలు, హాస్టళ్లు, పరిసర ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాలు పెట్టి అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల అటెండెన్స్ పెంచేందుకు బయో మెట్రిక్ మెషీన్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. ఉస్మానియాకు ఉద్యమాల చరిత్ర ఉందని, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందన్నారు. అయితే రాష్ట్రం ఏర్పడి మూడు సంవత్సరాలవుతున్న సందర్భంలో ఉస్మానియాలో విద్య, పరిశోధనకు ప్రాధాన్యత కల్పించాలని, గత వైభవాన్ని తీసుకురావాలన్నారు. సభలు, సమావేశాలు, రాజకీయాలకు విశ్వవిద్యాలయాలను వేదికలుగా చేసుకునేందుకు అవకాశం ఇవ్వవద్దన్నారు.

        సమావేశంలో ఉన్నత విద్య మండలి చైర్మన్ పాపిరెడ్డి, విద్యాశాఖ స్పెషల్ సిఎస్ రంజీవ్ ఆర్ ఆచార్య, ఉన్నత విద్య కమిషనర్ వాణి ప్రసాద్, మాధ్యమిక విద్య కమిషనర్ అశోక్, ప్రాథమిక విద్య సంచాలకులు కిషన్, విశ్వవిద్యాలయాల వీసీలు, రిజిస్ట్రార్లు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow