ఎల‌క్ట్రానిక్ ట్యాక్సీల‌ను ప్రారంభించిన మేయ‌ర్ రామ్మోహ‌న్‌

Spread the love

ఎల‌క్ట్రానిక్ ట్యాక్సీల‌ను ప్రారంభించిన మేయ‌ర్ రామ్మోహ‌న్‌
హాజ‌రైన ప్ర‌భుత్వ స‌ల‌హాదారులు పాపారావు, వివేక్‌లు

జీహెచ్ఎంసీలోని వాహ‌నాల‌ను కాలుష్య ర‌హిత వాహ‌నాలుగా చేప‌ట్ట‌నున్న‌ట్టు న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ తెలియ‌జేవారు. న‌క్లెస్‌రోడ్‌లో గ్రీన్‌మిల్‌ ఆధ్వ‌ర్యంలో ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు మొద‌టిసారిగా ఎల‌క్ట్రానిక్ ట్యాక్సీల‌ను ప్రారంభించింది. ఈ కాలుష్య ర‌హిత ఇ-ట్యాక్సీల‌ను మేయ‌ర్ రామ్మోహ‌న్ ప్రారంభించారు. రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా జి.వివేకానంద్‌, బి.వి.పాపారావు, జీహెచ్ఎంసీ క‌మీష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి త‌దిత‌రులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మేయ‌ర్ రామ్మోహ‌న్ మాట్లాడుతూ హైద‌రాబాద్ న‌గ‌రంలో 45ల‌క్ష‌ల‌కు పైగా వాహ‌నాలు ఉన్నాయ‌ని, వీటి ద్వారా న‌గ‌రం కాలుష్య‌మ‌యంగా అవుతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. న‌గ‌రంలో వాహ‌నాల కాలుష్యాన్ని త‌గ్గించేందుకు త‌గు ప్ర‌య‌త్నాలు చేప‌ట్ట‌నున్నామ‌ని, దీనిలో భాగంగా జీహెచ్ఎంసీలో ఉన్న చెత్త త‌ర‌లింపువాహ‌నాలు, ఇత‌ర వాహ‌నాల‌ను కాలుష్య ర‌హిత వాహ‌నాలుగా రూపొందించేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌ని, అందుకుగాను ఇ-ట్యాక్సీ వాహ‌నాల విధానాన్ని అద్య‌య‌నం చేయాల‌ని జీహెచ్ఎంసీ అధికారుల‌ను మేయ‌ర్ కోరారు.

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో ప్ర‌తిఒక్క‌రూ భాగ‌స్వామ్యం కావాల‌ని రామ్మోహ‌న్ పిలుపునిచ్చారు. కాలుష్యంతో నిండిన ఢిల్లీ న‌గ‌రాన్ని ప్ర‌స్థావిస్తూ ఢిల్లీలో కాలుష్యాన్ని త‌గ్గించేందుకు సీఎన్‌జి వాహ‌నాల‌ను ప్ర‌వేశ‌పెట్టార‌ని, అయినప్ప‌టికీ వాహ‌నాల కాలుష్య నియంత్ర‌ణ పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేక‌పోయింద‌ని అన్నారు. వీట‌న్నింటికి బ్యాట‌రీ, సూర్య‌ర‌శ్మీ ఆధారిత వాహ‌నాలే ప‌రిష్కార‌మ‌ని మేయ‌ర్ అన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు బి.వి.పాపారావు మాట్లాడుతూ అభివృద్ది సంక్షేమ రంగాల్లో దేశంలో ముందంజ‌లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కాలుష్య ర‌హిత రాష్ట్రంగా మార్చ‌డానికి ఇ-ట్యాక్సీలాంటి వాహ‌నాలు మ‌రిన్ని రావాల్సిన అవ‌శ్య‌క‌త ఉంద‌ని అన్నారు. ప్ర‌భుత్వ స‌ల‌హాదారు జి.వివేకానంద్ మాట్లాడుతూ హైద‌రాబాద్ న‌గ‌రంలో గ‌ణ‌నీయంగా పెరిగిన కాలుష్యం వ‌ల్ల ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు అధిక‌మ‌య్యాయ‌ని అన్నారు. న‌గ‌ర ప్ర‌జ‌ల ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ దృష్ట్యా ఇ-వ్యాన్‌ల మాదిరి కాలుష్య ర‌హిత వాహ‌నాలు గ‌ణ‌నీయంగా రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు. జీహెచ్ఎంసీ క‌మీష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి మాట్లాడుతూ ఆధునిక, సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఉప‌యోగించ‌డం ద్వారా ప‌ర్యావ‌ర‌ణహిత వాహ‌నాలను రూపొందించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు. హైద‌రాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్‌.వి.ఎస్‌.రెడ్డి మాట్లాడుతూ న‌గ‌రంలో కాలుష్యాన్ని త‌గ్గించ‌డానికి ఆటోల‌ను ఎల‌క్ట్రిక‌ల్ ట్యాక్సిలుగా మార్చాల‌ని సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఖైర‌తాబాద్ కార్పొరేట‌ర్ విజ‌య‌రెడ్డి, గ్రీన్‌మిల్ ప్ర‌తినిధులు సిద్దార్థ్‌, నిశాంత్‌, ఫ‌ని త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow