అనేక దీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ల‌భించింది – బ‌ల్దియా క‌మీష‌న‌ర్ జ‌నార్థ‌న్‌రెడ్డి

Spread the love

అనేక దీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ల‌భించింది – బ‌ల్దియా క‌మీష‌న‌ర్ జ‌నార్థ‌న్‌రెడ్డి


గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో కోటి మొక్క‌లు నాటేందుకు స‌న్న‌ద్ద‌త, హెచ్ఎండిఏ ప‌రిధిలో ఉన్న ప్ర‌తి మున్సిపాలిటీలో ఒక పార్కును ప్ర‌త్యేకంగా ఏర్పాటు, రూ. 628కోట్ల‌తో ఔట‌ర్ రింగ్‌రోడ్ ప‌రిధిలోని 183 గ్రామ‌పంచాయితీలు, 7మున్సిపాలిటీల‌కు జ‌ల‌మండ‌లి ద్వారా ర‌క్షిత మంచినీటి స‌ర‌ఫ‌రా అందించ‌డం త‌దిత‌ర ప్ర‌ధాన అంశాల‌పై నేడు జ‌రిగిన వివిధ విభాగాల సిటీ ఉన్న‌తాధికారుల స‌మ‌న్వ‌య స‌మావేశంలో విస్తృతంగా చ‌ర్చించారు. కీస‌ర‌లోని మేడ్చ‌ల్ జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో నేడు జ‌రిగిన సిటీ స‌మ‌న్వ‌య స‌మావేశానికి జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి, జ‌ల‌మండ‌లి ఎండి దాన కిషోర్‌, హెచ్ఎండీఏ క‌మిష‌న‌ర్ చిరంజీవులు, మేడ్చ‌ల్ క‌లెక్ట‌ర్ ఎం.వి.ఎస్‌.రెడ్డి, హైద‌రాబాద్ జాయింట్ క‌లెక్ట‌ర్ ప్ర‌శాంతి, ట్రాఫిక్ అడిష‌న‌ల్ సిపి ర‌వీంద‌ర్‌, ర‌మేష్‌నాయుడు త‌దిత‌ర ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. విశ్వ‌న‌గ‌రంగా రూపొందుతున్న గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో పెద్ద ఎత్తున అభివృద్ది కార్య‌క్ర‌మాలు, నిర్మాణాలు, మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు ప‌లు ప్రాజెక్ట్‌లు చేప‌డుతున్నందున, వీటి నిర్వ‌హ‌ణ‌లో వివిధ శాఖలు మ‌రింత స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఉన్న‌తాధికారులు అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి మాట్లాడుతూ సిటీ స‌మ‌న్వ స‌మావేశంలో స‌మ‌స్య ప్ర‌ధాన అంశంగా ఉంటుంద‌ని, గ‌త సంవ‌త్స‌రంన్న‌ర నుండి నిర్వ‌హిస్తున్న ఈ స‌మ‌న్వ‌య స‌మావేశంలో న‌గ‌రంలోని అనేక దీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ల‌భించింద‌ని గుర్తుచేశారు. హైద‌రాబాద్ ప‌రిధిలో నిర్వ‌హించ‌నున్న తెలంగాణ హ‌రిత‌హారంలో భాగంగా కోటి మొక్క‌ల‌ను నాట‌నున్న‌ట్టు తెలియ‌జేశారు. గ‌తానికి భిన్నంగా ఈ సారి ఔష‌ద మొక్క‌లు, క్రిమీకీట‌కాల నివార‌ణ మొక్క‌ల‌తో పాటు న‌గ‌ర‌వాసులు కోరుకున్న మొక్క‌ల‌ను అంద‌జేయ‌నున్న‌ట్టు పేర్కొన్నారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో ర‌హ‌దారుల‌పై ఏర్ప‌డే గుంత‌ల‌ను ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన మాన్సూన్ బృందాల‌తో పాటు ఇంజ‌నీరింగ్ విభాగం ఆధ్వ‌ర్యంలో ఎప్ప‌టిక‌ప్పుడు పూడ్చివేస్తున్నామ‌ని తెలిపారు. అయితే గ‌త ప‌ది రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల వ‌ల్ల కొత్త గుంత‌లు కూడా ఏర్ప‌డుతున్నాయ‌ని, వాటిని కూడా 24గంట‌ల వ్య‌వ‌ధిలో పూడ్చివేస్తున్న‌ట్టు తెలిపారు. ఈ గుంత‌ల పూడ్చివేత‌కుగాను రాయ‌పూర్ త‌దిత‌ర న‌గ‌రాల్లో ఉప‌యోగిస్తున్న ఆధునిక యంత్రాన్ని కూడా స‌మ‌కూర్చుకునేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని తెలిపారు.

న‌గ‌రంలో చేప‌డుతున్న డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాల‌కు గుర్తించిన భూములను వెంట‌నే జీహెచ్ఎంసీకి అంద‌జేయాల‌ని రెవెన్యూ అధికారుల‌ను క‌మిష‌న‌ర్ కోరారు. గ్రేట‌ర్ ప‌రిధిలో క్రీడా మైదానాల ఏర్పాటుకు ఖాళీ స్థ‌లాల‌ను ఉప‌యోగించాల‌ని, క‌మ్యునిటీహాళ్ల నిర్మాణాల‌ను చేప‌ట్ట‌వ‌ద్ద‌ని సూచించారు. మెట్రో పిల్ల‌ర్ల‌పై రోడ్ కాంగ్రెస్ సూచించిన ప్ర‌మాణాల‌కు అనుగుణంగా రేడియం స్టిక్క‌ర్ల‌ను ఏర్పాటు చేయాల‌ని మెట్రో రైలు అధికారుల‌కు తెలిపారు. ఈ సంద‌ర్భంగా జ‌ల‌మండ‌లి ఎండి దాన కిషోర్ మాట్లాడుతూ ఔట‌ర్ రింగ్‌రోడ్ ప‌రిధిలో ఉన్న అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల‌కు మంచినీటి సౌక‌ర్యాన్ని జ‌ల‌మండ‌లి ఆధ్వ‌ర్యంలో అందించ‌నున్నామ‌ని తెలిపారు. 183 గ్రామ‌పంచాయితీలు, 7 మున్సిపాలిటీల‌కుగాను రూ. 628 కోట్ల వ్య‌యంతో చేప‌ట్ట‌నున్న ఈ త్రాగునీటి ప‌థ‌కానికి రిజ‌ర్వాయ‌ర్లు నిర్మించేందుకు త‌గు స్థ‌లాన్ని కేటాయించాల‌ని క‌లెక్ట‌ర్ల‌ను కోరారు. అదేవిధంగా న‌గ‌రంలో న‌ల్లా క‌నెక్ష‌న్లు లేని పాఠ‌శాల‌ల‌కు ఉచితంగా న‌ల్లా క‌నెక్ష‌న్లు ఇవ్వాల‌ని మేడ్చ‌ల్ క‌లెక్ట‌ర్ ఎం.వి.ఎస్‌.రెడ్డి చేసిన‌ ప్ర‌తిపాధ‌న‌ల‌ను ప‌రిశీలించ‌నున్న‌ట్టు దాన‌కిషోర్ తెలిపారు. హెచ్ఎండీఏ క‌మిష‌న‌ర్ చిరంజీవులు మాట్లాడుతూ హెచ్ఎండీఏ ప‌రిధిలోని ఏడు జిల్లాల్లో ఉన్న మున్సిపాలిటీల్లో ఉద్యాన‌వ‌నాలు ఏర్పాటుచేసి రెండేళ్ల పాటు తామే నిర్వ‌హించ‌డానికి ఒక్కో మున్సిపాలిటీలో క‌నీసం రెండు ఎక‌రాల భూమిని త‌మ‌కు ఇవ్వాల‌ని క‌లెక్ట‌ర్ల‌ను కోరారు. హ‌రిత‌హారంలో భాగంగా హెచ్ఎండీఏ ప‌రిధిలో ప్లాంటేష‌న్ చేప‌ట్ట‌డానికి త‌మ వ‌ద్ద కోటి 80ల‌క్ష‌ల మొక్క‌లు సిద్ధంగా ఉన్నాయ‌ని తెలిపారు. హెచ్ఎండీఏ ప‌రిధిలో మొత్తం 3,132 చెరువులు ఉండ‌గా వీటిలో 2300చెరువుల‌కు స‌ర్వే పూర్తిచేయ‌డం జ‌రిగింద‌ని, వీటిని నోటిఫై చేయ‌డంతో పాటు హ‌ద్దుల నిర్థారించి ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురికాకుండా కంచెల‌ను ఏర్పాటు చేయాల్సి ఉంద‌ని చిరంజీవులు వివ‌రించారు . మేడ్చ‌ల్ క‌లెక్ట‌ర్ ఎన్‌.వి.ఎస్‌.రెడ్డి మాట్లాడుతూ 5వేల‌కుపైగా ప‌రిశ్ర‌మ‌లు ఉన్న మేడ్చ‌ల్ జిల్లాల్లో త్రాగునీరు, డ్రైనేజి ఏర్పాటు, పార్కులు, శ్మ‌శాన‌వాటిక‌ల నిర్మాణం త‌దిత‌ర ప‌నుల‌ను చేప‌ట్ట‌డానికి ప్ర‌త్యేక ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. త‌మ జిల్లాల్లో 70కిపైగా క్వారీగుంత‌లు ఉన్నాయి. వీటిలో ఉన్న నీటిలో ప‌డి అనేక మంది మ‌ర‌ణిస్తున్నందున వీటిని పూడ్చివేయ‌డం, లేదా ఇత‌ర అవ‌స‌రాల‌కు ఉప‌యోగించుకునేలా చూడాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు. దీంతో ఈ క్వారీ గుతంల్లో భ‌వ‌న నిర్మాణ వ్య‌ర్థాల‌ను వేయ‌డం ద్వారా ప్ర‌మాదాల నివార‌ణ జ‌రుగుతుంద‌ని జీహెచ్ఎంసీ క‌మిషన‌ర్ పేర్కొన్నారు. రోడ్ల‌పై అడ్డంగా ఉన్న విద్యుత్‌ స్తంభాల తొల‌గింపు, రోడ్ల మ‌ర‌మ్మ‌తులు, హైద‌రాబాద్ మెట్రో రైలు మార్గంలో రోడ్ల నిర్వ‌హ‌ణ‌, ప్ర‌భుత్వ భూముల‌ను జీఐఎస్‌తో అనుసంధానం త‌దిత‌ర అంశాల‌పై విస్తృత స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి జీహెచ్ఎంసీ, జ‌ల‌మండ‌లి, హెచ్ఎండీఏ, రెవెన్యూ, రోడ్లు, భ‌వ‌నాలు, విద్యుత్‌, అగ్నిమాప‌క, మేడ్చ‌ల్ జిల్లాకు చెందిన వివిధ శాఖ‌ల అధికారులు హాజ‌ర‌య్యారు. స‌మావేశానికి ముందు అధికారులు కీస‌ర ఆల‌యాన్ని సంద‌ర్శించి పూజ‌లు నిర్వ‌హించారు. మేడ్చ‌ల్ క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి, హెచ్ఎండీఏ క‌మిష‌న‌ర్ చిరంజీవిలు మొక్క‌లు నాటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow