ఉద్యోగుల్లో జ‌వాబుదారిత‌నం పెంపొందించేందుకు బ‌ల్దియా వినూత్న ప్ర‌చారం

Spread the love

ఇటీవ‌ల జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా కేంద్ర‌స్థాయి ఉద్యోగి చేసిన చిన్న త‌ప్పుతో మొత్తం ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను మొద‌టి నుండి తిరిగి చేప‌ట్టాల్సి వ‌చ్చింది. ఈ చిన్న త‌ప్పు వ‌ల్ల భారీ ఎత్తున ఎన్నిక‌ల వ్య‌యంతో పాటు పాల‌నా యంత్రాంగం అప్ర‌తిష్ట అవ‌డంతో పాటు మ‌రో 20 రోజులు ఎన్నిక‌ల ప్ర‌క్రియ కొన‌సాగింది. దీని ప్ర‌భావం న‌గ‌రంలో అభివృద్ది కార్య‌క్ర‌మాల అమ‌లుపై కూడా ప్ర‌భావం చూపింది. ఈ నేప‌థ్యంలో జీహెచ్ఎంసీలో ప‌నిచేసే ఉన్న‌తాధికారి నుండి క్రింది స్థాయి ఉద్యోగి వ‌ర‌కు త‌మ‌ విధుల‌ను వంద‌శాతం చిత్త‌శుద్దితో చేయాల‌ని, ఏచిన్న పొర‌పాటు జ‌రిగినా భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంద‌ని సందేశం తెలియ‌జేసే స్టిక్క‌ర్ల‌ను రూపొందించారు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి. విలుకాడు త‌న బాణాన్ని స్ప‌ష్ట‌మైన ల‌క్ష్యంతో ఒక యువ‌తి త‌ల‌పై ఉన్న ఆపిల్‌ను చేధించ‌డం వ‌ల్ల ఆ యువ‌తి ఆనందంతో ఉండ‌డం ఈ స్టిక‌ర్‌లో చిత్రించారు. అయితే అదే విలుకాడు త‌న ల‌క్ష్యంలో చూపిన‌ స్వ‌ల్ప నిర్ల‌క్ష్యం వ‌ల్ల త‌న బాణం ఆపిల్‌కు కాకుండా యువ‌తి క‌న్నుకు త‌గిలి చూపు కోల్పోవ‌డం జ‌రిగింది. తన ల‌క్ష్యంలో చేసిన చిన్న పొర‌పాటు వ‌ల్ల క‌న్ను కోల్పోవాల్సి వ‌చ్చింద‌నే సందేశాన్ని ఈ స్టిక‌ర్‌లో తెలిపారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల రీ పోలింగ్‌ను ఈ సందేశాత్మ‌క స్టిక‌ర్‌కు అన్వ‌యిస్తూ ప్ర‌తిఒక్క అధికారి, ఉద్యోగి త‌మ విధుల‌ను వంద శాతం నిబద్ద‌త‌తో నిర్వ‌హించాల‌ని కోరుతూ జీహెచ్ఎంసీలోని ప్ర‌తిఒక్క‌రికి ఈ స్టిక్క‌ర్ల‌ను పంపిణీ చేశారు. ప్ర‌తి అధికారి, ఉద్యోగి త‌మ విధుల‌ను గౌర‌వించాల‌ని కోరే *ఐల‌వ్ మై జాబ్‌*, త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చే న‌గ‌ర‌వాసుల‌తో *మ‌ర్యాద‌గా మాట్లాడుకుందాం*, విద్యుత్‌ను ఆదా చేసేందుకు *సేవ్ ఎన‌ర్జీ*, ప్ర‌తిఒక్క‌రూ త‌మ విధుల‌ను నిర్ల‌క్ష్యం చేయ‌కుండా *యాక్ట్ నౌ* లాంటి సందేశాత్మ‌క స్టిక్క‌ర్ల‌ను జీహెచ్ఎంసీలోని ప్ర‌తిఒక్క‌రి టేబుళ్ల‌పై ఉంచ‌డం ద్వారా వారిలో గ‌ణ‌నీయమైన‌ మార్పు తేవ‌డంలో జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి స‌ఫ‌లీకృతుల‌య్యారు. దీంతో మ‌రోసారి త‌మ విధుల‌ను వంద శాతం చిత్త‌శుద్దితో నిర్వ‌హించాల‌నే సందేశంతో కూడిన ఈ స్టిక్కర్లు బ‌ల్దియాలోని ప్ర‌తిఒక్క అధికారి, ఉద్యోగి స్వియ ఆత్మ విమ‌ర్శ‌కు బాట‌లు వేశాయి. తాము బాధ్య‌తాయుతంగా విధులు నిర్వ‌హించ‌డం, మ‌రింత జ‌వాబుదారిగా ఉండేందుకు పొర‌పాట్లు చేయ‌కుండా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డంలో క‌మిష‌న‌ర్ ప్ర‌వేశ‌పెట్టిన ఈ స్టిక్క‌ర్లు దోహ‌ద‌ప‌డ్డాయ‌ని జీహెచ్ఎంసీలోని ప‌లువురు అధికారులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow