ఒకే దేశం ఒక పన్ను విధానం జీఎస్టీ అమలు

Spread the love

జీఎస్టీ ప్రస్థానం
ఘంటారావం మోగించి జీఎస్టీకి స్వాగతం పలికిన ప్రధాని నరేంద్ర మోడీ
ఒకే దేశం ఒక పన్ను విధానం అమలు
1986 లో నాటి ఆర్థిక మంత్రి వీపీ సింగ్.. బడ్జెట్లో ఎక్సైజ్ టాక్సేషన్ నిర్మాణంలో చేసిన ప్రధాన సవరణతో జీఎస్టీకీ బీజం.!
2000 లో జీఎస్టీని పరిచయం చేసిన వాజ్‌పేయ్
2003 లో విజయ్ కేల్కర్ నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు
2006 లో జీఎస్టీ గురించి మొదటిసారీ తన బడ్జెట్‌లో ప్రస్తావించిన చిదంబరం
2009 లో జీఎస్టీ బేసిక్ నిర్మాణాన్ని తె లిపిన నాటి ఆర్ధిక మంత్రి, ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
2013 జీఎస్టీని అమలు చేయాలని తీర్మానించిన యుపిఎ ప్రభుత్వం
2015 జీఎస్టీ కోసం రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
2017 మార్చ్ 29న లోక్‌సభలో ఎట్టకేలకు జీఎస్టీకి ఆమోదం
1986లో బీజం పడితే…1 జూన్ 2017లో అమైలెన జీఎస్టీ

హైదరబాద్, జూన్ 30 : నేటి నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి రానే వచ్చింది. పార్లమెంట్ సెంట్రల్ హాల్ ఇందుకు వేదికైంది.. శుక్రవారం అర్థరాత్రి ప్రత్యేక సమావేశం లో ప్రధాని నరేంద్ర మోడీ ఘంటారావం మోగించి జీఎస్టీకి స్వాగతం పలికారు. ఇక నుండి ఒకే దేశం ఒక పన్ను విధానం అమలవుతోంది. దేశీయ పన్నుల వ్యవస్థలో సమూల సంస్కరణ అంటూ బీజేపీ ప్రభుత్వం ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ను అమలు చేసింది. మరోవైపు జీఎస్టీ పరిణామాలపై తీవ్ర చర్చోప చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. 17 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం తర్వాత, నేటి నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చింది. అయితే జీఎస్టీ అనే భావనను పరిచయం చేసింది ఎవరు. ఎక్కడనుంచి దీని ప్రస్థానం మొదలైంది ఒకసారి చూద్దాం.

ఫిబ్రవరి 1986లో ఆర్థిక శాఖ మంత్రి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ 1986-87 సంవత్సర బడ్జెట్లో ఎక్సైజ్ టాక్సేషన్ నిర్మాణంలో ఒక ప్రధాన సవరణను ప్రతిపాదించారు. అనంతరం 2000 ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయ్ జీఎస్టీని పరిచయం చేశారు. అలాగే అప్పటి పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి అసిమ్ దాస్ గుప్తా నేతృత్వంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇదే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ప్రయాణానికి నాందిగా చెప్పుకోవాలి.
2003 విజయ్ కేల్కర్ నేతృత్వంలోని టాస్క్ఫోర్స్ కమిటీ ఏర్పాటుద్వారా ప్రస్తుత పన్నుల వ్యవస్థను జీఎస్టీతో రీప్లేస్ చేయాలని చెప్పారు.
2004 యూపీఏ అధికారంలోకి వచ్చింది.

ఫిబ్రవరి 28, 2006 అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం మొదటిసారి బడ్జెట్ ప్రసంగంలో జీఎస్టీ గురించి ప్రస్తావించారు. ఏప్రిల్ 1, 2010 నాటికి ప్రతిష్టాత్మక జీఎస్టీ అమలుకానుందని చెప్పారు. దీని అమలుకోసం ఆర్థిక మంత్రి మంత్రుల సాధికారిక కమిటీ ద్వారా రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తుందని చెప్పారు. ఈ కమిటీని ఏర్పాటుకు రెండేళ్ల సమయం పట్టగా.. 2008 ఈ కమిటీ ఏర్పాటైంది. 2008 ఏప్రిల్ ’ఎ మోడల్ అండ్ రోడ్ మ్యాప్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ పేరతో తన రిపోర్ట్ అందించింది. ఆ తర్వాత ఏడాదికి.. అంటే 2009 ఎంపవర్డ్ కమిటీ తొలి డిస్కషన్ పేపర్ను అందించింది. కానీ అప్పటితో యూపీఏ-వన్ పదవీకాలం ముగిసిపోయింది.

తిరిగి 2009 యూపీఏ రెండో సారి అధికారం దక్కించుకున్నాక ఆర్థిక మంత్రిగా ప్రణబ్ ముఖర్జీ పదవీ స్వీకారం చేశారు. అనంతరం ఆయన జీఎస్టీ బేసిక్ నిర్మాణాన్ని వివరించారు. జీఎస్టీ అమలుకు 2010 డెడ్ లైన్గా పునరుద్ఘాటించారు. అపుడు బీజేపీ దీన్ని వ్యతిరేకించింది. 2011 లోక్సభలో జీఎస్టీకి అవసరమైన రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. మార్చి 29, 2011 యశ్వంత్ సిన్హా నాయకత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీని జిఎస్టి బిల్లును ప్రస్తావించింది. అసిమ్ దాస్ గుప్తా కమిటీకి రాజీనామా చేయడంతో కేరళ ఆర్థిక మంత్రి కెఎం మణి ఆ స్థానాన్ని ఆక్రమించారు.
2013 జీఎస్టీని అమలు చేయాలని యుపిఎ ప్రభుత్వం తీర్మానించింది. చిదంబరం తన బడ్జెట్ ప్రసంగంలో జీఎస్టీ వల్ల నష్టపోయిన రాష్ట్రాలకు కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. 2012 నవంబరులో ఆర్థికమంత్రి చిదంబరం రాష్ట్ర ఆర్థిక మంత్రులతో సమావేశం డిసెంబరు 31 నాటికి అన్ని సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయం. 2013 ఆగస్టులో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ జిఎస్టీ కొత్త ప్రతిపాదనలతో నివేదిక సమర్పించింది. కాగా అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీ జిఎస్టి బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. దీని కారణంగా ప్రతి సంవత్సరం రూ.14,ంంం కోట్లు నష్టమని విమర్శించారు.
అయితే 2013 ఆగస్ట్లో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ జీఎస్టీపీ తన నివేదికను అందించగా.. ఈ కమిటీ నివేదించిన సూచనలను బిల్లులో చేర్చారు. 2013 సెప్టెంబర్లో సాధికారిక కమిటీకి సవరించిన బిల్లును పంపారు. ఈ కమిటీ అందించిన సూచనల ప్రకారం 2014లో మరోసారి బిల్లును సవరించారు.

2014 కేంద్రంలో అధికారంలోకి వచ్చిన జీఎస్టీ అమలుపై వేగంగా చర్యలు చేపట్టింది. డిసెంబరు 18న జీఎస్టీకి 122 వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. జీఎస్టీ కోసం రాజ్యాంగ సవరణ బిల్లుకు 2015 మే నెలలో లోక్సభ ఆమోదం లభించింది. ఇక్కడ మళ్లీ ప్రతిపక్షంలో కాంగ్రెస్ నుంచి అభ్యంతరాలు వచ్చాయి. జీఎస్టీని 18 శాతానికి పరిమితం చేయాలని పట్టుబట్టింది కాంగ్రెస్. అలాగే 1 శాతం ఎంట్రీ ట్యాక్స్ను తొలగించాల్సిందేనని తేల్చి చెప్పింది.

2016 ఆగస్ట్లో ప్రధాన అడ్డంకిగా ఉన్న రాజ్యసభ కూడా జీఎస్టీ బిల్లును ఆమోదించింది. సెప్టెంబరు 12న కేంద్ర మంత్రివర్గం ఆమోదంతో జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు కాగా, సెప్టెంబర్ 22-23 తేదీల్లో కౌన్సిల్ మొదటిసారి సమావేశమైంది. ఈ సందర్బంగా ఆదాయం నష్టపోయే రాష్ట్రాలకు నష్టపరిహారం చెల్లించేలా 2016 అక్టోబర్ 18న జీఎస్టీ కౌన్సిల్ ఒక ప్రతిపాదన చేసింది. అదే ఏడాది నవంబర్ 3న 5, 12, 18, 28 శాతం అంటూ నాలుగు శ్లాబుల విధానానికి జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అలాగే సెస్ను కూడా ఆమోదించారు. సెంట్రల్ జీఎస్టీ, స్టేట్ జీఎస్టీలపై ఏకాభిప్రాయం కుదర్చడంలో జీఎస్టీ కౌన్సిల్ విఫలం అయింది. 2016 డిసెంబర్ 23న జీఎస్టీ కౌన్సిల్లో రెండు చట్టాలకు ఒప్పందం కుదిరినా.. ద్వంద్వ నియంత్రణ మాత్రం ప్రశ్నార్ధకంగానే నిలిచింది.

2017 జనవరి 3న కాంపెన్సేషన్ కార్పస్ను 55 వేల కోట్ల రూపాయల నుంచి 90000 కోట్లకు పెంచడంతో చాలా సమస్యలకు పరిష్కారం లభించింది. 2017 జనవరి 16న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ భేటీలో పన్ను విధించే అధికారంలో ద్వంద్వ నియంత్రణపై వచ్చిన సమస్యలకు పరిష్కారం లభించింది. 2017 ఫిబ్రవరి 18న డ్రాఫ్ట్ కాంపెన్సేషన్ బిల్లును జీఎస్టీ కౌన్సిల్ తుది రూపునిచ్చింది. అనంతరం సెంట్రల్ జీఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ, యూనియన్ టెరిటరీ జీఎస్టీలకు ఆమోదం లభించింది.
మార్చ్ లో కేంద్ర కేబినెట్ అన్ని (5)జీఎస్టీ బిల్లులకు ఆమోదం పలుకగా.. మార్చ్ 27న లోక్సభలో తుది బిల్లులను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టారు. 2017 మార్చ్ 29న లోక్సభ జీఎస్టీకి ఆమోదం పలకగా.. మే నెలలో జీఎస్టీ కౌన్సిల్ పలు మార్లు చర్చలు జరిపి.. వస్తువులు-సేవలపై రేట్లను ఖరారు చేశారు. ఫైనల్గా ప్రతిపక్షాల నిరసనల శుక్రవారం అర్థరాత్రి నుంచి జీఎస్టీ అమలుకు బీజేపీ సర్కార్ శంఖారావం పూరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow