మహాత్మ జ్యోతిబాపూలే జయంతి ఉత్సవ ఆహ్వాన పత్రం విడుదల

Spread the love

విద్య మాత్రమే పేదల జీవితాల్ని మారుస్తుందని నమ్మిన వ్యక్తి మహాత్మ జ్యోతిబాపూలే అని అన్నారు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్. జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే ఇద్దరూ బడుగు, బలహీనవర్గాల్ని చైతన్యం చేయడానికి వారిని విద్యావంతుల్ని చేయడానికి మహోన్నతమైన కృషి చేశారని చెప్పారాయన. ఈనెల 11న జ్యోతిబాపూలే జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా పూలే జయంతి ఆహ్వాన పత్రాన్ని మహాత్మ జ్యోతిబాపూలే రాష్ట్రస్థాయి జయంతి ఉత్సవకమిటీ ఛైర్మన్ గణేశ్ చారీ, కమిటీ వైస్ ఛైర్మన్లతో కలిసి మంత్రి ఈటల రాజేందర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. పూలే ఆశయ సాధన దిశగా ప్రభుత్వం సాగుతుందన్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రగతితోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ఉద్యమ సమయంలో చెప్పిన మాటకు కట్టుబడి ఆయా వర్గాల అభివృద్దికోసం కృషి చేస్తున్నామని చెప్పారు. బడ్జెట్లో పెద్దపీట వేయడమే కాకుండా అనేక రకాల సంక్షేమ పథకాల అమలుతో పేద ప్రజల అభ్యున్నతికి బాటలు పరిచామన్నారు మంత్రి ఈటల రాజేందర్. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సన్న బియ్యం పథకం, విద్యార్థులకు మెస్ ఛార్జీలు 680 రూపాయల నుంచి 1500 రూపాయలకు పెంచడం, గురుకుల విద్యాలయాల ఏర్పాటుతో పాటు ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. ఎస్సీలతో పాటు వెనుకబడిన తరగతుల విద్యార్థులకు కూడా విదేశీ విద్యకోసం ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. పూలే ఆశయసాధన కోసం పునరంకితం అవుదామని, జయంతి ఉత్సవాలకు ప్రజలంతా తరలిరావాలని మంత్రి ఈటల పిలుపునిచ్చారు.
బలహీనవర్గాలకు రిజర్వేషన్ల కోసం ఆలోచించిన మొదటి వ్యక్తి జ్యోతిబాపూలే అని చెప్పారు శాసనసభ్యుడు శ్రీనివాస్ గౌడ్. అందుకే అంబేద్కర్ పూలేను గురువుగా భావించారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినట్లు పథకాలు గతంలోనే ప్రవేశపెడితే ఇప్పటికే అసమానతలు కనుమరుగయ్యేవని అభిప్రాయం వ్యక్తం చేశారాయన. ప్రతిపక్షాలు ఇప్పటికైనా హర్షం వ్యక్తం చేయకుండా…. బడ్జెట్లో బీసీలకు పెద్దపీట వేయడాన్ని వ్యతిరేకించడం బాధాకరమని చెప్పారు.
పూలే ఉత్సవకమిటీ ఛైర్మన్ గణేశ్ చారీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాడ్డాకే బీసీలకు అసలైన స్వాతంత్రం వచ్చిందని చెప్పారు. బీసీ వర్గాలకు, కుల వృత్తులకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకుందని చెప్పారాయన. పూలే జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం కోసం ప్రభుత్వం చేపడుతున్న ఏర్పాట్లపై గణేశ్ చారీ హర్షం వ్యక్తం చేశారు.
సచివాలయం డి-బ్లాక్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహత్మ జ్యోతిబాపూలే ఉత్సవకమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow