రాష్ట్రావతరణ దినోత్సవ కానుకగా అమ్మఒడి-కెసిఆర్ కిట్లు

Spread the love

 

  • జూన్ 2 నాటికి అన్ని ఏర్పాట్లు
  • ఆధార్‌తో ఆసరా తరహా సరళతర అకౌంట్లు
  • పైలట్ ప్రాజెక్టుగా పాలమూరు వివరాలు
  • బిడ్డ కడపులో పడ్డప్పటి నుంచీ టీకాల దాకా సమాచారం కంప్యూటరీకరణ
  • రోబస్ట్ సాఫ్ట్‌వేర్‌ని పరిశీలించిన వైద్యశాఖ మంత్రి
  • ప్రజలకు విస్తృత అవగాహన-పకడ్బందీగా అమలు
  • అధికారులను ఆదేశించిన లక్ష్మారెడ్డి

హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు రాష్ట్రావతరణ దినోత్సవ కానుకగా అందించనున్న అమ్మ ఒడి-కెసిఆర్ కిట్ల కార్యక్రమాన్ని జూన్ 2వ తేదీన ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకం పనులు శరవేగంగా నడుస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఓ బలమైన రోబస్ట్ సాఫ్ట్‌వేర్‌ని రూపొందించారు. పైలట్ ప్రాజెక్టుగా పాలమూరుకు సంబంధించిన వివరాలు పొందుపరచారు. ఆ వివరాలను పరిశీలించి, సమీక్షించారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి. ఈ సందర్భంగా మంత్రికి అధికారులు సాఫ్ట్వేర్ పనితీరుని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అత్యంత పకడ్బందీగా ఎలాంటి సమస్యలు రాకుండా అమ్మ ఒడి-కెసిఆర్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా విస్తృత ప్రచారాన్ని కూడా నిర్వహించాలని మంత్రి నిర్ణయించారు.

క్రమం తప్పకుండా పరీక్షలు

ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, అమ్మ ఒడి-కెసిఆర్ కిట్ల పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా, పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. గర్బిణీలను ప్రాథమిక దశలోనే గుర్తించడం, నమోదు చేయడం, నెల నెలా వారికి అవసరమైన పరీక్షలు చేయించడం విధిగా క్రమం తప్పకుండ జరగాలన్నారు. వివిధ పరీక్షల సమయంలోనే హై రిస్క్ కేసులని గుర్తించాలని, ఆ రిస్క్‌ని బట్టి ఆయా గర్బిణీలను ఏ హాస్పిటల్లో ప్రసవం చేయించాలన్నది నిర్ణయించాలన్నారు. ఆ నిర్ణయాన్ని ముందుగానే గర్బిణీలు, వారి అటెండెంట్, కుటుంబ సభ్యులకి తెలపడం ద్వారా, నిర్ణీత ప్రసవ కేంద్రాల్లోనే ప్రసవాలు జరిగేట్లు చూడాలని సూచించారు. ఈ విధంగా చేయడం వల్ల ప్రసవాల సమయాల్లో తల్లీ బిడ్డలను ప్రాణాపాయ స్థితుల నుంచి రక్షించవచ్చన్నారు. అన్ వాంటెడ్ ఆపరేషన్లని తగ్గించొచ్చన్నారు. సిజేరియన్, సెక్షన్ల సంఖ్యని కూడా మరింత తగ్గించేందుకు ఈ పద్ధతి ఉపయోగపడగలదని మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు.

ఆధార్‌తో అకౌంట్లు

ఆధార్ అను సంధానంతో గర్బిణీలకు కచ్చితంగా బ్యాంక్ అకౌంట్లు తెరిపించాలని మంత్రి లక్ష్మారెడ్డి అధికారులని ఆదేశించారు. వృద్ధులకి అందిస్తున్న ఆసరా పెన్షన్ల మాదిరిగా సులభంగా, సరళంగా, వేగంగా వారి డబ్బులు వారి ఖాతాలో పడటమేగాక, విత్ డ్రా చేసుకునే వీలుండాలన్నారు.

ఆర్థిక సాయం-పారదర్శకత

గర్బిణీలకు ఎఎన్‌సి పరీక్షలు నిర్వహించిన సమయంలో రూ.4వేలు, ప్రసూతి సమయంలో రూ.4వేలు, ప్రసవానంతరం, బిడ్డలకి టీకాల కోసం రూ.4వేలు మొత్తం రూ.12వేలు ఎలాంటి ఆటంకాలు లేకుండా అందేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆడ బిడ్డ పుడితే అమ్మ ఒడి-కెసిఆర్ కిట్ల పథకంలో ప్రభుత్వం ఇస్తున్న అదనపు వెయ్యి రూపాయలతో కలిపి ఇవ్వాల్సిన ఉంటుందన్నారు. ఇక ఈ అకౌంట్ల నిర్వహణలో పారదర్శకతను పాటించాలని మంత్రి సూచించారు.

కంప్యూటర్లలో అన్ని వివరాలు రికార్డు

మరోవైపు అమ్మ ఒడి-కెసిఆర్ కిట్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన రోబస్ట్ సాఫ్ట్ వేర్ ని, అందులో పైలట్ ప్రాజెక్టుగా పొందుపరచిన మహబూబ్‌నగర్ జిల్లా గర్బిణీల వివరాలను మంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు చూపించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి స్పందిస్తూ, బిడ్డ కడుపులో పడ్డప్పటి నుంచి టీకాలిచ్చే వరకు పూర్తి సమాచారం అందులో నిక్షిప్తమై ఉండాలన్నారు. గర్బిణీకి ఇచ్చిన చికిత్స, చేసిన పరీక్షలు, ప్రసవం జరిగిన వైద్యశాల, ప్రసవం సందర్భంగా తలెత్తిన సమస్యలు, అందుకు ఇచ్చిన చికిత్స, సిజేరియన్ అయిందా? లేక సెక్షన్‌తోనే ప్రసవం జరిగిందా? లేక సుఖ ప్రసవమా? అన్న వివరాలు, బిడ్డకు ఇచ్చిన టీకాలు, వాళ్ళకి అందిన ప్రభుత్వ సహాయం డబ్బులు, తల్లీ బిడ్డలకు అందించే కేసిఆర్ కిట్లు వంటి అన్ని వివరాలు రికార్డు కావాలన్నారు.

ఎఎన్ఎంల ట్యాబ్స్-శిక్షణ

ఈ సందర్భంగా మంత్రికి కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వాకాటి కరుణ రాష్ట్ర స్థాయిలో జరిగిన శిక్షణను వివరించారు. అలాగే ఎఎన్ఎంలకు ట్యాబ్స్ ఇచ్చామని, గర్బిణీల సమాచారాన్ని అందులోనే రికార్డు చేయాలని ఆదేశించామని మంత్రికి తెలిపారు. ఆయా వివరాలను బట్టి గర్బిణీలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే వీలవుతుందని ఆమె మంత్రికి వివరించారు.

అన్ని సదుపాయాలతో ప్రసవ కేంద్రాలు

కాగా, అమ్మ ఒడి – కెసిఆర్ కిట్ల పథకం మంచిగా అమలవ్వాలంటే, ముందుగా ప్రభుత్వ ప్రసవ కేంద్రాలు అన్ని వసతులతో ఉండాలని మంత్రి లక్ష్మారెడ్డి అధికారులకి చెప్పారు. అన్ని ఎంసిహెచ్ సెంటర్లని పూర్తి స్థాయిలో అన్ని సదుపాయాలతో తీర్చిదిద్దాలని మంత్రి అధికారులని ఆదేశించారు. ఈ సమీక్షలో వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజేశ్వర్ తివారీ, డిఎంఇ రమణి, టిఎస్ఎంఎస్ఐడిసి ఎండి వేణుగోపాల్, తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow