డిసెంబ‌ర్ నాటికి అండ‌ర్‌పాస్‌…వ‌చ్చే జూన్ నాటికి ఫ్లైఓవ‌ర్ నిర్మాణ ప‌నులు పూర్తి

Spread the love

డిసెంబ‌ర్ నాటికి అండ‌ర్‌పాస్‌…వ‌చ్చే జూన్ నాటికి ఫ్లైఓవ‌ర్ నిర్మాణ ప‌నులు పూర్తి

స్ట్రాట‌జిక్ రోడ్ డెవ‌ల‌ప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా మాదాపూర్ మైండ్ స్పేస్ జంక్ష‌న్ వ‌ద్ద 103కోట్ల రూపాయ‌ల అంచ‌నా వ్య‌యంతో జీహెచ్ఎంసీ నిర్మిస్తున్న ఫ్లైఓవ‌ర్‌, అండ‌ర్ పాస్, యుటిలిటి డ‌క్ట్‌తో కూడిన స‌ర్వీస్ రోడ్డు ప‌నులు శ‌ర‌వేగంగా న‌డుస్తున్నాయి. రూ. 48.06కోట్ల వ్య‌యంతో రాడిస‌న్ నుండి దుర్గం చెరువు మార్గంలో ఫ్లైఓవ‌ర్ నిర్మాణ ప‌నులు, రూ. 25.78 కోట్ల వ్య‌యంతో అండ‌ర్ పాస్ నిర్మాణ ప‌నులు, రూ. 28.83 కోట్ల వ్య‌యంతో యుటిలిటి డ‌క్ట్ రోడ్‌తో పాటు డ్రెయిన్‌తో కూడిన స‌ర్వీస్ రోడ్ నిర్మాణ ప‌నులు ముమ్మ‌రంగా సాగుతున్నాయి. ప్ర‌స్తుతం మైండ్‌స్పేస్ మార్గంలో గంట‌కు 14,393 వాహ‌నాలు వెళ్తున్నాయి. 2035నాటికి ఈ మార్గంలో గంట‌కు 31,536 వాహ‌నాలు న‌డుస్తాయ‌ని అంచ‌నా, దీంతో పాటు దుర్గం చెరువుపై ఏర్పాటు చేయ‌నున్న కేబుల్ బ్రిడ్జి నిర్మాణంతో జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట ప్రాంతాల‌కు ప్ర‌యాణించేవారికి అతిత‌క్కువ దూరం ఉండ‌డంతో ఈ మార్గంలో గ‌ణ‌నీయంగా ట్రాఫిక్ పెరుగుతుంద‌ని అంచ‌నా వేశారు. ఈ అంచ‌నా ప్ర‌కారం దుర్గంచెరువు బ్రిడ్జి పూర్తి అయిన అనంత‌రం మైండ్‌స్పేస్ మార్గంలో గంట‌కు 46,390 వాహ‌నాలు ప్ర‌యాణిస్తాయ‌ని అద్య‌య‌నంలో తేలింది. దీంతో మైండ్ స్పేస్ జంక్ష‌న్‌తో పాటు ప‌రిస‌ర ప్రాంతాలు పూర్తిస్థాయిలో అభివృద్ది చేయ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. మైండ్ స్పేస్ జంక్ష‌న్ ప‌నుల‌న్నింటినీ 2018 జూన్ మాసంలోగా పూర్తిచేయాల‌నే ల‌క్ష్యంతో జీహెచ్ఎంసీ ప‌నుల‌ను ముమ్మ‌రంగా చేప‌డుతోంది.

ఫ్లైఓవ‌ర్ నిర్మాణ ప‌నులు

రూ. 48.06 కోట్ల వ్య‌యంతో 830మీట‌ర్ల పొడ‌వునా మైండ్ స్పేస్ వ‌ద్ద ఫ్లైఓవ‌ర్ నిర్మాణ ప‌నులు పురోగ‌తిలో ఉన్నాయి. మొత్తం 16.60 మీట‌ర్ల వెడ‌ల్పులో ఉండే ఈ ఫ్లైఓవ‌ర్ రెండు లేన్ల మార్గంలో క్యారేజ్ వే క‌లిగి ఉన్నాయి. 22 పిల్ల‌ర్లు, 420మీట‌ర్ల వ‌య‌డ‌క్ట్‌, 216మీట‌ర్ల ఆబ్లిగేట‌రిస్పాన్‌లతో ఈ ఫ్లైఓవ‌ర్ నిర్మాణం పురోగ‌తిలో ఉంది. నేటి వ‌ర‌కు 9 పిల్ల‌ర్ల ఫుట్టింగ్ నిర్మాణ ప‌నులు పూర్తికాగా, మ‌రో నాలుగు పిల్ల‌ర్ల నిర్మాణానికి త‌వ్వ‌కాలు పూర్తి అయ్యాయి. డ్రైనేజీ, యుటిలిటి డ‌క్ట్‌ల నిర్మాణ ప‌నులు స‌మాంత‌రంగా పురోగ‌తిలో ఉన్నాయి. ఈ ఫ్లైఓవ‌ర్ ప‌నుల‌ను 2018 జూన్ మాసాంతంలోగా పూర్తి చేయ‌నున్న‌ట్టు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి ప్ర‌క‌టించారు.

అండ‌ర్‌పాస్ నిర్మాణ ప‌నులు

బ‌యోడైవ‌ర్సిటీ పార్కు నుండి సైబ‌ర్ ట‌వ‌ర్స్ వైపు మార్గంలో 365మీట‌ర్ల పొడ‌వు గ‌ల అండ‌ర్ పాస్ నిర్మాణాన్ని రూ. 25.78కోట్ల వ్య‌యంతో చేప‌ట్టారు. ఈ అండ‌ర్‌పాస్‌కు 83మీట‌ర్ల పొడవునా క్లోజ్‌డ్ బాక్స్ ఉండ‌గా 182మీట‌ర్ల అప్రోచ్ పొడ‌వుతో మొత్తం 28.80 మీట‌ర్ల (ఆరు లేన్ల‌) వెడ‌ల్పు క‌లిగి ఉంది. కాగా ఈ అండ‌ర్ పాస్ నిర్మాణంలో మొత్తం 365మీట‌ర్ల‌గాను 147మీట‌ర్ల పొడ‌వున ప‌నులు పూర్తి అయ్యాయి. 83మీట‌ర్ల క్లోజ్‌డ్ బాక్స్‌కు గాను 53మీట‌ర్ల పొడ‌వున త‌వ్వ‌కాలు పూర్తి అయ్యాయి. ర‌హేజా మార్గం వైపు 135మీట‌ర్ల త‌వ్వ‌కాలు జ‌ర‌పాల్సి ఉండ‌గా 80మీట‌ర్ల పొడ‌వున త‌వ్వ‌కాలు పూర్తి అయ్యాయి. ఈ అండ‌ర్‌పాస్ నిర్మాణ ప‌నుల‌ను 2017 డిసెంబ‌ర్ మాసాంతం వ‌ర‌కు పూర్తిచేయాల‌న్న ల‌క్ష్యంతో జీహెచ్ఎంసీ ప‌నులు చేప‌ట్టింది. రూ. 28.83కోట్ల వ్య‌యంర్తితో 2600మీట‌ర్ల పొడువునా స‌ర్వీస్ రోడ్ల నిర్మాణం చేప‌ట్టగా ఇప్ప‌టి వ‌ర‌కు 1450మీట‌ర్ల ప‌నులు పూర్త‌య్యాయి. జీహెచ్ఎంసీ చేప‌డుతున్న ప‌నుల‌తో పాటు ఈ మార్గానికి ప‌లు ప్రాంతాల నుండి వ‌చ్చే రోడ్లను కూడా టీఎస్ఐఐసి ఆధ్వ‌ర్యంలో అభివృద్ది చేప‌ట్టారు.

స‌మ‌న్వ‌యంతో ప‌నుల్లో వేగం – క‌మిష‌న‌ర్‌

రాష్ట్ర మున్సిప‌ల్ శాఖ మంత్రి కె.టి.రామారావు, న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌ల నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌, ప్ర‌తి పక్షం రోజుల‌కు ఒక‌సారి నిర్వ‌హిస్తున్న సిటీ స‌మ‌న్వ‌య స‌మావేశం వ‌ల్లే న‌గ‌రంలో చేప‌డుతున్న ఎస్‌.ఆర్‌.డి.పి ప‌నులు వేగ‌వంతంగా న‌డుస్తున్నాయ‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి వెల్ల‌డించారు. ముఖ్యంగా మైండ్‌స్పేస్ జంక్ష‌న్ వ‌ద్ద చేప‌డుతున్న అండ‌ర్ పాస్‌, ఫ్లైఓవ‌ర్ నిర్మాణాల‌కు ఎన్నో అవ‌రోధాలు వ‌స్తున్నాయ‌ని, వీట‌న్నింటిని సిటీ క‌న్వ‌ర్జెన్స్ స‌మావేశంలో చ‌ర్చించి సంబంధిత శాఖ‌లు త‌క్ష‌ణ‌మే స్పందించేలా చేయ‌డం వ‌ల్ల ప‌నులు ఆటాంకాలు లేకుండా ముమ్మ‌రంగా కొన‌సాగుతున్నాయ‌ని తెలిపారు. ముఖ్యంగా జ‌ల‌మండ‌లి, విద్యుత్‌, డ్రైనేజీ పైప్‌లైన్ల తొల‌గింప, వివిధ ప్రైవేట్‌, ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌కు చెందిన కేబుళ్ల వైర్ల తొల‌గింపుకు సంబంధించిన స‌మ‌న్య‌ల‌ను సిటీ క‌న్వ‌ర్జెన్స్ స‌మావేశంలో ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్చించి సంబంధిత శాఖ‌లు స్పందించేలా నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రిగింద‌ని జ‌నార్థ‌న్‌రెడ్డి తెలిపారు. అదేవిధంగా మైండ్ స్పేస్ జంక్ష‌న్‌లో అండ‌ర్ పాస్ నిర్మాణ ప‌నుల‌కు రాయి అడ్డంరావ‌డంతో దీనికోసం ప్ర‌త్యేకంగా బ్లాస్టింగ్ అనుమ‌తుల‌ను పోలీసు శాఖ నుండి తీసుకొని చేప‌ట్టామ‌ని క‌మిష‌న‌ర్ తెలిపారు. ఈ నిర్మాణ ప‌నుల్లో ఏవిధ‌మైన ట్రాఫిక్ ఇబ్బందులు క‌లుగ‌కుండా ట్రాఫిక్ పోసుల స‌హ‌కారం కూడా పొందామ‌ని పేర్కొన్నారు. అండ‌ర్‌పాస్‌, ఫ్లైఓవ‌ర్ నిర్మాణ ప‌నుల సంద‌ర్భంగా 33కేవి, 11కేవి విద్యుత్ కేబుళ్ల తొల‌గింపు, మంచినీటి స‌ర‌ఫ‌రా పైప్‌లైన్ల తొల‌గింపు త‌దిత‌ర క్లిష్ట‌మైన ప‌నుల‌న్నీ సిటీ స‌మ‌న్వ‌య స‌మావేశం ద్వారానే సుల‌భ‌త‌రంగా మారాయ‌ని క‌మిష‌న‌ర్ జ‌నార్థ‌న్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow