ఉపాది కల్పనలో దేశానికే ఆదర్శంగా నిలవాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు

Spread the love

 

  • అవకాశాలను అందిపుచ్చుకునే నైపుణ్యం అలవర్చుకోవాలి
    కష్టపడితే సాధించలేనిదేమీ లేదు
  • సాధ్యం కాదనుకున్న తెలంగాణాను సాధించుకున్న నేర్పు మన సొంతం
  • ఉపాధి శిక్షణలో దేశంలోనే నెంబర్ 2గా తెలంగాణా నిలిచింది
  • ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్ప కంపనీలన్నీ తెలంగాణాకు క్యూ కడుతున్నాయి
  • తెలంగాణాలో ఉపాధి అవకాశాలకు కొదవలేదు
  • 2022 నాటికి 10 కోట్ల ఉద్యోగావకాశాలు ఏర్పడనున్నాయి
  • వరల్డ్ యూత్ స్కిల్స్ డే వేడుకల్లో
  • పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్- ఉపాది కల్పనలో దేశానికే తెలంగాణాను ఆదర్శంగా మార్చేలా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. హైటెక్స్ లోని నేషనల్ అకాడమీ ఫర్ కన్స్ట్రక్షన్ లో శనివారం జరిగిన వరల్డ్ యూత్ స్కిల్స్ డే వేడుకలకు మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… సాధ్యం కాదనుకున్న తెలంగాణాను సాధించుకున్న నేర్పు మన సొంతమని… అవకాశాలను అందిపుచ్చుకునే నైపుణ్యం అలవర్చుకుంటే ఉపాధికి కొదవ లేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్ప గొప్ప సంస్థలన్నీ తెలంగాణాలో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయన్నారు. తెలంగాణాలో ఉపాధి అవకాశాలకు ఏ మాత్రం కొదవ లేదని… కష్టపడితే ఏదైనా సాధించవచ్చన్నారు. 2022 నాటికి 10 కోట్ల ఉద్యోగావకాశాలు ఏర్పడనున్నాయని… వీటిని దక్కించుకునేందుకు నైపుణ్య శిక్షణ అవసరం అన్నారు. తెలంగాణా ఏర్పాడ్డ తర్వాత దీన్ దయాల్ గ్రామీణ కౌశల్య యోజన పథకం కింద దాదాపు 18 వేల మంది యువతీయువకులకు ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇప్పించి… ప్లేస్మెంట్స్ కల్పించడం జరిగిందన్నారు. గత ఏడాది నైపుణ్య శిక్షణ ఇవ్వడంలో దేశంలోనే తెలంగాణా రెండో స్థానంలో నిలిచిందని… ఈసారి మొదటి స్థానంలో నిలిపేలా శిక్షణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టేందుకు కార్యాచరణ సిద్దం చేశామన్నారు. కేంద్రం మంజూరు చేసిన దానికి అదనంగా మరో 50 వేల మందికి ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. అలాగే ప్రతి జిల్లాలోనూ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ సీఈఓ నీతూ ప్రసాద్ మాట్లాడుతూ…కొంత శిక్షణ ఇవ్వడం ద్వారా మనలో ఉన్న నైపుణ్యానికి పదును పెట్టవచ్చన్నారు. ఆ దిశగా ఈజీ ఎంయం ముందుకు పోతుందని… గ్రామీణ యువతకు తగిన ప్రోత్సాహం ఇస్తూ వారికి ఉపాధి మార్గాలను చూపుతున్నామన్నారు. ఈజీయంయం ఏజెన్సీల తరఫున జాగృతి విద్యాసంస్థల చైర్మన్ ఎస్వీ రావు మాట్లాడుతూ… పల్లెల్లో ఉన్న యువతకు ఉచిత శిక్షణ ఇస్తూ.. ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తమ వంతుగా కృషి చేస్తున్నామన్నారు. ఇందులో తమకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తోందని…తద్వారా ఎక్కువ సంఖ్యలో యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం సాధ్యమవుతుందన్నారు. శిక్షణ పొంది ఉపాధి అవకాశాలు దక్కించుకున్న పలువురు విద్యార్థులు మాట్లాడుతూ… డిగ్రీ, ఇంటర్ చేసిన తర్వాత ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్న తమకు ఈజీయంయం దిక్సూచిగా నిలిచిందని కొనియాడారు. నెలకు 10 వేల నుండి 35 వేల వరకు సంపాదించుకుంటూ జీవితంలో స్థిరపడేందుకు అవకాశం కల్పించిన ప్రభుత్వానికి దన్యవాదాలు తెలిపారు.
విజయగాథల పుస్తకావిష్కరణ…
ఈజీయంయం ద్వారా శిక్షణ పొంది… ఉపాధి అవకాశాలు దక్కించుకున్న 1000 మంది యువతీయువకుల విజయగాథలతో రూపొందించిన పుస్తకాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు అవిష్కరించారు. అనంతరం శిక్షణ కేంద్రాల నిర్వహకులకు…ఉపాధి కల్పించిన సంస్థల ప్రతినిధులకు మెమొంటోలు అందజేసి సత్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow