రూ. 18వేల కోట్లతో డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం : మంత్రి కే.టి.ఆర్‌

Spread the love

రూ. 18వేల కోట్లతో డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం – మంత్రి కే.టి.ఆర్‌

దేశంలో మ‌రే రాష్ట్రంలోలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 18వేల కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌ట్టింద‌ని రాష్ట్ర మున్సిప‌ల్ వ్య‌వ‌హ‌రాల శాఖ మంత్రి కె.టి.రామారావు వెల్ల‌డించారు. కూక‌ట్‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని చిత్తార‌మ్మ‌న‌గ‌ర్ బ‌స్తీ, కైత‌లాపూర్‌ల‌లో డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి కె.టి.రామారావు శంకుస్థాప‌న చేశారు. ర‌వాణా శాఖ‌మంత్రి మ‌హేంద‌ర్‌రెడ్డి, మ‌ల్కాజ్‌గిరి ఎంపి మ‌ల్లారెడ్డి, శాస‌న స‌భ్యులు కృష్ణారావు, జీహెచ్ఎంసీ క‌మీష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి, మేడ్చ‌ల్ జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.వి.రెడ్డిలు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా మున్సిప‌ల్ శాఖ మంత్రి మాట్లాడుతూ ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రంలో పేద‌ల ఆత్మ‌గౌర‌వాన్ని పెంపొందించేందుకే డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ ప‌థ‌కాన్ని ప్ర‌భుత్వం ప్రారంభించింద‌ని అన్నారు. ఒక్కో ఇంటికి ఎనిమిద‌న్న‌ర ల‌క్ష‌ల రూపాయ‌ల వ్య‌యం అవుతుండ‌గా ఈ మొత్తం వ్య‌యాన్ని ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తోంద‌ని తెలిపారు. బ‌హిరంగ మార్కెట్ల‌లో ఈ డ‌బుల్ బెడ్‌రూం ఇంటికి 30ల‌క్ష‌ల రూపాయ‌లు వ్య‌యం అవుతుంద‌ని తెలిపారు. గ‌తంలో బ‌ల‌హీన వ‌ర్గాల గృహాల‌కు కేవ‌లం 70వేల నుండి ల‌క్ష రూపాయ‌లు మాత్ర‌మే అందించార‌ని అన్నారు.

హైద‌రాబాద్ న‌గ‌రంలో ల‌క్ష డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల‌ను నిర్మించాల‌ని ల‌క్ష్యంగా నిర్ణ‌యించుకోగా ఇప్ప‌టి వ‌ర‌కు 40వేల ఇళ్ల నిర్మాణాల‌కు టెండ‌ర్లు పూర్తై ప‌నులు ప్రారంభం అవుతున్నాయ‌ని అన్నారు. మ‌రో రెండు నెల‌ల్లోగా మిగిలిన 60వేల ఇళ్ల కు టెండ‌ర్ ప్ర‌క్రియ పూర్తిచేసి ప‌నుల‌ను కూడా ప్రారంభిస్తామ‌ని తెలియ‌జేశారు. రాష్ట్రంలో మొద‌టి ద‌శ‌లో రెండున్న‌ర ల‌క్ష‌ల డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాల‌ను పూర్తిచేయాల‌నే ల‌క్ష్యంతో ఉన్నామ‌ని అన్నారు. దేశంలోనే 29 రాష్ట్రాల్లో ఇలాంటి డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ ప‌థ‌కం మ‌రెక్క‌డాలేద‌ని గుర్తుచేశారు. పూర్తిగా ప్ర‌భుత్వం నిర్మించే ఈ డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల‌కు ద‌ళారుల‌కుగాని మ‌రెవ్వ‌రికిగాని ఒక్క రూపాయి లంచం కూడా ఇవ్వ‌వ‌ద్ద‌ని మంత్రి అన్నారు. న‌గ‌రంతో పాటు రాష్ట్రంలో ఇల్లులేని నిరుపేద‌లంద‌రికీ ఇళ్ల‌ను నిర్మించి ఇవ్వ‌నున్న‌ట్టు మంత్రి స్ప‌ష్టం చేశారు. చిత్తార‌మ్మ బ‌స్తీలో 9అంత‌స్తుల్లో రూ. 9.34కోట్ల వ్య‌యంతో 108 డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల‌ను నిర్మిస్తుండ‌గా కైత‌లాపూర్‌లో రూ. 12.46కోట్ల వ్య‌యంతో 144డ‌బుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించ‌నున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow