బ‌ల్దియా ప‌రిధిలో భారీ అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

Spread the love

జీహెచ్ఎంసీ ఆధ్వ‌ర్యంలో 3కోట్ల రూపాయ‌ల‌తో నిర్మించిన వంతెన‌ను, రూ. 3.88కోట్ల వ్య‌యంతో చేప‌ట్టిన మ‌ల్క‌చెరువు, న‌ల్ల‌గండ్ల చెరువుల అభివృద్ది ప‌నుల‌ను రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి కె.టి.రామారావు నేడు ప‌రిశీలించారు. కూక‌ట్‌ప‌ల్లి ఎల్ల‌మ్మబండ క్రాస్‌రోడ్స్ నుండి ఆల్విన్‌కాల‌నీకి వెళ్లే మార్గంలో రూ. 3కోట్ల వ్య‌యంతో నిర్మించిన బ్రిడ్జిని మంత్రి ప్రారంభించారు. ఈ బ్రిడ్జి ప్రారంభంతో ఓల్డ్ ఆల్వీన్‌కాల‌నీ బ్రిడ్జిపై ట్రాఫిక్ గ‌ణ‌నీయంగా త‌గ్గ‌డంతో పాటు జ‌గ‌ద్గిరిగుట్ట నుండి మూసాపేట్ జె.ఎన్‌.టి.యు రోడ్డు మార్గంలో రాక‌పోక‌లు మ‌రింత సుల‌భత‌రం అవుతుంది. శేరిలింగంప‌ల్లిలోని న‌ల్ల‌గండ్ల పెద్ద చెరువు అభివృద్ది ప‌నుల‌ను త‌నిఖీ చేశారు. 2017 ఏప్రిల్ 20వ తేదీన న‌ల్ల‌గండ్ల చెరువును సంద‌ర్శించిన మంత్రి కె.టి.ఆర్ ఈ చెరువును పూర్తిస్థాయిలో అభివృద్ది చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో రూ. 2.25కోట్ల వ్య‌యంతో జీహెచ్ఎంసీ పెద్ద చెరువుకు చైన్‌లింక్ ప్ర‌హ‌రీనిర్మాణం, చెరువు క‌ట్ట ప‌టిష్ట‌త‌, వాక్-వే, టాయిలెట్ బ్లాక్‌ల నిర్మాణం, విద్యుదీక‌ర‌ణ‌ను చేప‌ట్టింది. న‌గ‌రంలోని చెరువుల పున‌రుద్ద‌ర‌ణ‌, అభివృద్దిలో భాగంగా ఈ చెరువు అభివృద్ది ప‌నుల‌ను చేప‌ట్టింది. అనంత‌రం కోటి 60ల‌క్ష‌ల వ్య‌యంతో అభివృద్ది ప‌నులు జ‌రుగుతున్న మ‌ల్క‌చెరువును కూడా మంత్రి కె.టి.ఆర్ ప‌రిశీలించారు. మంత్రి కె.టి.ఆర్‌తో పాటు మంత్రులు నాయిని న‌ర్సింహారెడ్డి, మ‌హేంద‌ర్‌రెడ్డిలు కూడా ఉన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కె.టి.రామారావు మాట్లాడుతూ న‌గ‌రంలోని చెరువుల అభివృద్దికి తాము చిత్త‌శుధ్దితో కృషిచేస్తున్నామ‌ని తెలిపారు. త‌మ కృషితో పాటు స్థానిక కాల‌నీ సంక్షేమ సంఘాలు కూడా క‌లిసి రావాల‌ని పిలుపునిచ్చారు. న‌గ‌రంలోని అధిక శాతం చెరువుల్లో గుర్ర‌పుడెక్క ప్ర‌ధాన సమస్య‌గా మారింద‌ని, దీనికి ప్ర‌ధాన కార‌ణం క‌లుషిత జ‌లాల‌ను చెరువుల్లోకి వ‌దల‌డ‌మేన‌ని అన్నారు. క‌లుషిత జ‌లాలు చెరువుల్లోకి వెళ్ల‌కుండా సీవ‌రేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ల‌ను ఏర్పాటు చేసుకోవాల‌ని కాల‌నీ సంక్షేమ సంఘాలు, అపార్ట్‌మెంట్‌ల యాజ‌మాన్యాల‌ను మంత్రి కోరారు. న‌గ‌రంలోని చెరువుల అభివృద్దిని చేప‌ట్ట‌డానికి ప‌లు కార్పొరేట్ సంస్థ‌లు కూడా ముందుకు వ‌స్తున్నాయ‌ని పేర్కొన్నారు. సిటీలో ఉన్న చెరువుల ప‌రిర‌క్ష‌ణ అభివృద్దితో పాటు ర‌హ‌దారుల అభివృద్దికి తాము అత్యంత ప్రాధాన్య‌త‌ను ఇస్తున్న‌ట్టు మున్సిప‌ల్ శాఖ మంత్రి పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా పార్ల‌మెంట్ స‌భ్యులు కొండా విశేశ్వ‌ర్‌రెడ్డి, స్థానిక శాస‌న స‌భ్యులు అడికెపురి గాంధీ, డిప్యూటి మేయ‌ర్ బాబా ఫ‌సియోద్దీన్‌, స్థానిక కార్పొరేట‌ర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow