ముస్లింల పేదరికం పోవాలంటే పిల్లల్ని చదివించడమే అసలైన మార్గం

Spread the love

ముస్లింల పేదరికం పోవాలంటే పిల్లల్ని చదివించడమే అసలైన మార్గం


సిద్ధిపేటలో పేద ముస్లిం కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ చేసిన మంత్రి హరీశ్ రావు

సిద్ధిపేట, జూన్ 11 : అప్నా టీఆర్ ఎస్ గవర్నమెంట్ ఆనేకే బాద్.. మైనారిటీ లోగోంకేలియే.. బహుత్ సోచా హై.. పహేలే గరిబోంకో హటానా.. ఔర్ టీఆర్ ఎస్ కే హుకుమత్ మే.. ముస్లిం మైనారిటీ లోగోంకో పడాయి దిలానా బహుత్ జరురీ హాయ్ అని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. ముస్లిం మైనారిటీ పేద కుటుంబాల్లోని పేదరికం పోవాలంటే వారి పిల్లలను చదివించడమెుక్కటే మార్గమని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సిద్దిపేటలోని పేద ముస్లిం కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేనివిధంగా ముస్లింల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నదని హరీశ్ రావు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 200 ఇంగ్లీషు మీడియం రెసిడెన్షియల్ పాఠశాలలు తీసుకువచ్చిందని.. వాటి కోసం 4 వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. ముఖ్యంగా ముస్లింల పిల్లల చదువు కోసం ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నదన్నారు. ఇప్పటికే 100 రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభించి ఒక్కో విద్యార్థిపై సంవత్సరానికి 80 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నదని వివరించారు. సిద్ధిపేటలో ఇప్పటికే 2 మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలను తెచ్చుకున్నామని.. వాటిలో గతేడాదిలోనే బాలుర పాఠశాల ఉన్నదని, రేపు సోమవారం సిద్ధిపేటలో మైనారిటీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను ప్రారంభించుకుంటున్నామని మంత్రి హరీశ్ రావు చెప్పారు.

ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ముస్లిం కుటుంబాలు తమ పిల్లలను బాగా చదివించాలని సూచించారు. చిన్నతనం నుండే పిల్లలను పనులకు పంపించి వారి భవిష్యత్తును నాశనం చేయవద్దని చెప్పారు. అలాగే షాదీ ముబారక్ ద్వారా పేద ముస్లిం ఆడపిల్లల పెళ్ళి కోసం 75 వేల రూపాయలు సహాయం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. దేశంలో మరెక్కడా లేని విధంగా రంజాన్ సందర్భంగా పేద ముస్లిం కుటుంబాలకు ప్రభుత్వం తరఫున బట్టలు, నిత్యవసర వస్తువులు అందజేస్తున్నామని, ప్రభుత్వం పక్షాన ముఖ్యమంత్రి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నారని వివరించారు. ముస్లింలను అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్, సిద్ధిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఇతర కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow