మ‌రో అంత‌ర్జాతీయ స‌ద‌స్సుకు వేదిక కానున్న హైద‌రాబాద్‌

Spread the love

హైద‌రాబాద్ న‌గ‌రం మ‌రో మెగా స‌ద‌స్సుకు ఆతిధ్యం ఇవ్వ‌బోతుంది. దాదాపు 130 దేశాల నుండి ఐదు వేల మంది ప్ర‌తినిధులు పాల్గొనే *లంగ్ హెల్త్‌* అనే పేరుతో ప్ర‌పంచ స‌ద‌స్సు జ‌ర‌గ‌నుంది. 2019 చివ‌రిలోగాని, 2020 ప్ర‌థ‌మార్థంలో గాని జ‌ర‌గ‌నున్న ఈ లంగ్‌హెల్త్ ప్ర‌పంచ స‌ద‌స్సు భార‌త‌దేశంలో మొట్ట‌మొద‌టిసారిగా జ‌ర‌గ‌నుంది. ఈ స‌ద‌స్సు నిర్వ‌హ‌ణ‌కు పూర్తిస్థాయిలో స‌హ‌క‌రించాల‌ని కోరుతూ స‌ద‌స్సు నిర్వాహ‌క గ్లోబ‌ల్ డైరెక్ట‌ర్ ఎమిలి టి.బ్లిట్జ్ న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌ను క‌లిసి విజ్ఞ‌ప్తి చేశారు. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధుల నివార‌ణ‌పై ప్ర‌తి సంవ‌త్స‌రం ఈ స‌ద‌స్సును నిర్వ‌హిస్తున్నామ‌ని, ఈ సారి ఈ అవ‌కాశం తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌కు ద‌క్కింద‌ని ఆమె వివ‌రించారు. 2017 అక్టోబ‌ర్‌లో మెక్సికో, 2016 లివ‌ర్‌పూల్‌, 2015లో కెప్‌టౌన్‌, 2014బాసిలోనా, 2013 ప్యారీస్‌లో నిర్వ‌హించిన‌ట్లు పేర్కొన్నారు. ఈ స‌ద‌స్సు నిర్వ‌హ‌ణ వ‌ల్ల హైద‌రాబాద్ ప్ర‌పంచ న‌గ‌రాల్లో ఒక‌టిగా మ‌రోసారి ప్రాచూర్యం పొందే అవ‌కాశం ఉన్నందున త‌గు స‌హాయ స‌హ‌కారాలు అందించాల‌ని ఆమె మేయ‌ర్‌కు విజ్ఞ‌ప్తి చేశారు. ఈ స‌ద‌స్సు నిర్వ‌హ‌ణ‌కు ఏవిధ‌మైన స‌హాయ స‌హ‌కారాల‌ను అందించాల్సిన అంశంపై రాష్ట్ర టూరిజం శాఖ కార్య‌ద‌ర్శి ఇత‌ర సంబంధిత అధికారుల‌తో చ‌ర్చించనున్న‌ట్టు మేయ‌ర్ రామ్మోహ‌న్ ఈ సంద‌ర్భంగా హామీ ఇచ్చారు. లంగ్‌హెల్త్ స‌ద‌స్సు గ్లోబ‌ల్ హెల్త్ డైరెక్ట‌ర్ ఎమిలి బ్లిట్జ్‌కు మేయ‌ర్ రామ్మోహ‌న్ జ్ఞాపిక‌తో స‌న్మానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow