పోలీస్‌స్టేష‌న్ల‌కు స్వ‌చ్ఛ అవార్డులు – మ‌హిళ‌ల‌కు ల‌క్ష బ‌హుమ‌తి

Spread the love

పోలీస్‌స్టేష‌న్ల‌కు స్వ‌చ్ఛ అవార్డులు – మ‌హిళ‌ల‌కు ల‌క్ష బ‌హుమ‌తి
సిటీ క‌న్వ‌ర్జెన్స్ మీటింగ్‌లో నిర్ణ‌యం

స్వ‌చ్ఛ హైద‌రాబాద్‌లో భాగంగా ప‌రిశుభ్ర‌త‌, ప‌చ్చ‌ద‌నాన్ని పాటించే పోలీస్‌స్టేష‌న్ల‌కు స్వ‌చ్ఛ పోలీస్ స్టేష‌న్లుగా ప్ర‌త్యేక అవార్డుల‌ను అందించ‌డం, ట్రాఫిక్ నిబంధ‌న‌లు పాటించ‌ని, ఛ‌లాన్లు అధిక సంఖ్య‌లో పెండింగ్‌లో ఉన్న వాహ‌నాల‌ను స్వాదీన‌ప‌ర్చుకోవ‌డం, త‌డి, పొడి చెత్త‌ను వేరుచేసే న‌గ‌ర మ‌హిళ‌ల‌కు ల‌క్ష రూపాయ‌ల బ‌హుమ‌తిని అందించాల‌ని నేడు జ‌రిగిన సిటీ స‌మ‌న్వ‌య స‌మావేశంలో నిర్ణ‌యించారు. రాచ‌కొండ పోలీసు క‌మిష‌న‌రేట్ ఆధ్వ‌ర్యంలో హ‌బ్సిగూడ‌లోని జ‌న్‌ప్యాక్ కార్యాల‌యంలో జ‌రిగిన సిటీ క‌న్వ‌ర్జెన్స్ స‌మావేశానికి జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి, హెచ్ఎండీఏ క‌మిష‌న‌ర్ టి.చిరంజీవులు, సైబ‌రాబాద్ క‌మిష‌న‌ర్ మ‌హేష్‌భ‌గ‌వ‌త్‌, హైద‌రాబాద్ ట్రాఫిక్ జాయింట్‌ క‌మిష‌న‌ర్ ర‌వీంద‌ర్‌, డిసిపిలు ఏఆర్ శ్రీ‌నివాస్‌, ర‌మేష్‌నాయుడు త‌దిత‌ర ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి మాట్లాడుతూ హైద‌రాబాద్ న‌గ‌రాన్ని స్వ‌చ్ఛ న‌గ‌రంగా తీర్చిదిద్ద‌డానికి అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను భాగ‌స్వామ్యం చేస్తూ ప‌లు కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నామ‌ని, దీనిలో భాగంగా ప‌రిశుభ్ర‌త‌, ప‌చ్చ‌ద‌నంతో పాటు స్వ‌చ్ఛ‌త‌పై ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌ప‌రిచే పోలీసు స్టేష‌న్ల‌కు కూడా ప్ర‌త్యేక పుర‌స్కారాల‌ను అంద‌జేస్తామ‌ని ప్ర‌క‌టించారు. హైద‌రాబాద్‌న‌గ‌రంలో చేప‌ట్టిన హ‌రిత‌హారంలో భాగంగా జీహెచ్ఎంసీ న‌ర్స‌రీల్లో 40ర‌కాలకుపైగా మొక్క‌లు అందుబాటులో ఉన్నాయ‌ని, త‌మ‌కు కావాల్సిన మొక్క‌ల‌ను స‌మీపంలోని న‌ర్స‌రీల నుండి స్వీక‌రించి నాట‌డంతో పాటు వాటి ప‌రిర‌క్ష‌ణకు కూడా ప్ర‌త్యేక శ్ర‌ద్ద చూపించాల‌ని పేర్కొన్నారు. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ల‌తో పాటు ఔట‌ర్ రింగ్‌రోడ్ పై త‌ర‌చుగా ప్ర‌మాదాలు జ‌రిగే ప్రాంతాల‌ను గుర్తించి తిరిగి ప్ర‌మాదాలు సంభ‌వించ‌కుండా చేప‌ట్టాల్సిన‌ స్వ‌ల్ప‌కాలిక‌, దీర్ఘ‌కాలిక చ‌ర్య‌ల‌ను సూచించ‌డానికి సంబంధిత శాఖ‌లు అద్య‌య‌నం చేయాల‌ని జ‌నార్థ‌న్‌రెడ్డి సూచించారు. ఈ ప్రాంతాల్లో ప్ర‌మాదాలు జ‌ర‌గ‌కుండా ఇప్ప‌టికే గ‌తంలో చేసిన కొన్ని అద్య‌య‌నాలు ఉన్నాయ‌ని, వాటి త‌క్ష‌ణం అమ‌ల‌య్యే విధంగా ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని పేర్కొన్నారు. న‌గ‌రంలో ట్రాఫిక్ స‌మ‌స్య ప‌రిష్క‌రానికి ఎస్.ఆర్‌.డి.పిలో చేప‌డుతున్నఫ్లైఓవ‌ర్లు, అండ‌ర్ పాస్‌ల నిర్మాణానికి ఏర్ప‌డుతున్న ప్ర‌తిబంధ‌కాల‌న్ని స్థానిక ట్రాఫిక్‌, రెవెన్యూ, విద్యుత్‌, జ‌ల‌మండ‌లి త‌దిత‌రు అధికారులు ప‌ర్య‌టించి త‌గు ప‌రిష్కార మార్గాల‌ను క్షేత్ర‌స్థాయిలో చేప‌ట్టాల‌ని సూచించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి కావాల్సిన భూముల‌ను వెంట‌నే జీహెచ్ఎంసీకి బ‌ద‌లి చేయాల్సిందిగా సంగారెడ్డి రంగారెడ్డి జిల్లాల రెవెన్యూ అధికారుల‌ను ఆదేశించారు. హెచ్ఎండీఏ క‌మిష‌న‌ర్ చిరంజీవులు మాట్లాడుతూ ఔట‌ర్ రింగ్‌రోడ్డుపై ప్ర‌మాదాల నివార‌ణ‌కు నివార‌ణ‌కు రాచకొండ క‌మిష‌నర్ చేసిన ప‌లు సూచ‌న‌లను అమ‌లు చేస్తామ‌ని పేర్కొన్నారు. అదేవిధంగా వ‌రంగ‌ల్ ఉప్ప‌ల్ మీదుగా హైద‌రాబాద్ న‌గ‌రానికి వ‌చ్చే వ‌చ్చే ట్రాఫిక్ అధికంగా ఉన్నందున ఆ మార్గంలో ప్ర‌త్యామ్నాయ ర‌హ‌దారిని నిర్మించ‌డంతో పాటు ప్ర‌త్యేక బ‌స్ ట‌ర్మిన‌ల్ నిర్మాణానికి ప్ర‌ణాళిక‌లు రూపొందించిన‌ట్లు చిరంజీవులు వెల్ల‌డించారు. రాచ‌కొండ క‌మిష‌న‌ర్ మ‌హేష్‌భ‌గ‌వ‌త్ మాట్లాడుతూ న‌గ‌ర ప్ర‌జ‌ల్లో ట్రాఫిక్ నిబంధ‌న‌ల పాటింపుపై చైత‌న్య కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు. ట్రాఫిక్ ఉల్లంఘ‌న‌పై మూడు ఛ‌లాన్లు పెండింగ్‌లో ఉంటే ఆయా వాహ‌నాల‌ను సీజ్‌చేసే అవ‌కాశం కూడా ఉంద‌ని హెచ్చ‌రించారు. మెట్రోరైలు పిల్ల‌ర్ల‌పై రేడియం స్టిక్క‌ర్ల‌ను త్వ‌రిత‌గ‌తిన ఏర్పాటు చేయాల‌ని మెట్రో రైలు అధికారుల‌ను కోరారు. ఆటోన‌గ‌ర్‌లో ఇసుక లారీల పార్కింగ్ వ‌ల్ల ప‌రిస‌రాల్లో ఉన్న కాల‌నీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ఈ పార్కింగ్‌ను ఏర్పాటు చేయ‌డానికి ప్ర‌త్యామ్నాయ స్థ‌లాల‌ను త్వ‌రిత‌గ‌తిన సూచించాల్సిందిగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ క‌మిష‌న‌ర్ల‌ను కోరారు. ఔట‌ర్ రింగ్‌రోడ్డుపై త‌ర‌చుగా జ‌రుగుతున్న ప్ర‌మాదాల‌ను నివారించ‌డానికి స‌రిప‌డ లైటింగ్‌, సైనేజి బోర్డులు, రేలింగ్‌ల ఏర్పాటు, వాహ‌నాల వేగాన్ని తెలిపే సైన్ బోర్డుల‌ను ఏర్పాటు చేయాల‌ని సూచించారు. ఈ స‌మావేశంలో జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజ‌నీర్ సురేష్‌కుమార్‌, శ్రీ‌ధ‌ర్‌, జియాఉద్దీన్‌, అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్లు కెన‌డి, శంక‌ర‌య్య‌, భాస్క‌రాచారిల‌తో పాటు జ‌ల‌మండ‌లి, హెచ్ఎండీఏ, విద్యుత్‌, రెవెన్యూ, రోడ్లు, భ‌వ‌నాలు, నీటి పారుద‌ల శాఖ త‌దిత‌ర శాఖ‌ల ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow