తెలంగాణ‌లో నైట్‌షెల్ట‌ర్ల నిర్వ‌హ‌ణ భేష్‌…సుప్రింకోర్టు సాధికారిక క‌మిటి

Spread the love

తెలంగాణ‌లో నైట్‌షెల్ట‌ర్ల నిర్వ‌హ‌ణ భేష్‌…సుప్రింకోర్టు సాధికారిక క‌మిటి

దేశంలోని ఇత‌ర రాష్ట్రాల‌ను పోల్చిచూస్తే తెలంగాణ‌లో నైట్ షెల్ట‌ర్ల ఏర్పాటు, నిర్వ‌హ‌ణ మెరుగ్గా ఉంద‌ని నైట్ షెల్ట‌ర్ల నిర్వ‌హ‌ణ‌పై ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయ‌మూర్తి జస్టీస్ కైలాష్ గంబీర్ నేతృత్వంలో సుప్రింకోర్టు ఏర్పాటుచేసిన త్రిస‌భ్య‌ సాధికారిక‌ క‌మిటి ప్ర‌శంసించింది. రాష్ట్రంలో నైట్ షెల్ట‌ర్ల నిర్వ‌హ‌ణ‌పై సుప్రింకోర్టు ఏర్పాటు చేసిన క‌మిటి నేడు మున్సిప‌ల్ శాఖ డైరెక్ట‌ర్ కార్యాల‌యంలో వివిధ శాఖ‌ల ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించింది. రాష్ట్ర ప్ర‌భుత్వ మున్సిప‌ల్‌, ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ కార్య‌ద‌ర్శి న‌వీన్‌మిట్ట‌ల్‌, రాష్ట్ర మ‌హిళా శిశు సంక్షేమ శాఖ కార్య‌ద‌ర్శి జ‌గదీశ్వ‌ర్‌, జీహెచ్ఎంసీ క‌మీష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి, వివిధ శాఖ‌ల ఉన్న‌తాధికారులు ఈ స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. మున్సిప‌ల్ శాఖ డైరెక్ట‌ర్ టి.కె.శ్రీ‌దేవి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ స‌మావేశంలో జ‌స్టీస్ కైలాష్ గంబీర్ మాట్లాడుతూ దేశంలోని ఇత‌ర రాష్ట్రాల‌క‌న్నా తెలంగాణ రాష్ట్రంలో నిరాశ్ర‌యుల‌కు సౌక‌ర్యార్థం ఏర్పాటు చేసిన నైట్ షెల్ట‌ర్ల నిర్వ‌హ‌ణ మెరుగ్గా ఉంద‌ని పేర్కొన్నారు. అయితే షెల్ట‌ర్ల‌లో ఉండేవారికి ఉప‌యోగ‌క‌రంగా ఉండేవిధంగా హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాల‌ని సూచించారు.

హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు ఇత‌ర న‌గ‌రాల్లో నిర్మాణంలో ఉన్న నైట్ షెల్ట‌ర్ల‌ను వెంట‌నే పూర్తిచేయాల‌ని సూచించారు. అదేవిధంగా హైద‌రాబాద్ న‌గ‌రంలో నిరాశ్ర‌యుల‌పై తిరిగి స‌ర్వేను నిపుణులైన స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌చే నిర్వ‌హించాల‌ని జ‌స్టీస్ గంబీర్ పేర్కొన్నారు. నైట్‌షెల్టర్లు వాటిలోని సౌక‌ర్యాల‌పై విస్తృత ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాల‌ని ఆయ‌న సూచించారు. మున్సిప‌ల్‌, ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ కార్య‌ద‌ర్శి న‌వీన్ మిట్ట‌ల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడేళ్ల కాలానికి నైట్‌షెల్ట‌ర్ల నిర్వ‌హ‌ణ‌, నిర్మాణాల‌పై ప్ర‌త్యేక ప్ర‌ణాళిక రూపొందించిన‌ట్లు పేర్కొన్నారు. ఏ ఒక్క‌రు కూడా నిరాశ్ర‌యులుగా ఉండ‌కూడ‌ద‌నే ల‌క్ష్యంతో ఈ ప్ర‌ణాళిక‌లు రూపొందించామ‌ని తెలిపారు. మ‌హిళా శుశు సంక్షేమ శాఖ కార్య‌ద‌ర్శి జ‌గ‌దీశ్వ‌ర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కేవ‌లం బాలిక‌ల‌కు ప్ర‌త్యేకంగా 32 బాల స‌ద‌నాలు నిర్వ‌హిస్తున్నామ‌ని తెలిపారు. జీహెచ్ఎంసీ క‌మీష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి మాట్లాడుతూ హైద‌రాబాద్ న‌గ‌రంలో ప్ర‌స్తుతం 12 నివాస కేంద్రాలు (నైట్‌షెల్ట‌ర్లు) ప‌నిచేస్తున్నాయ‌ని పేర్కొన్నారు. వీటిలో 8 పురుషుల‌కు, నాలుగు మ‌హిళ‌ల‌కు ప్ర‌త్యేకంగా కేటాయించామ‌ని, వీటిలో నీరు, టాయిలెట్లు, విద్యుత్ త‌దిత‌ర మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పించ‌డంతో పాటు మంచాలు, బెడ్‌లు, పెడ్‌షీట్స్, దుప్ప‌ట్లు, వంట సామాగ్రి, గ్యాస్‌స్టౌ, లాక‌ర్లు, టేబుళ్లు, కుర్చీల‌ను ఏర్పాటు చేశామ‌ని వివ‌రించారు. హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప్ర‌ధాన ప్ర‌భుత్వ ఆసుప‌త్రులైన ఉస్మానియా, నిలోఫ‌ర్‌, కోఠి మెట‌ర్న‌రీ ఆసుప‌త్రి, ఇ.ఎన్‌.టి ఆసుప‌త్రి, పంజాగుట్ట నిమ్స్ ఆసుప‌త్రి, న‌ల్ల‌కుంట ఫీవ‌ర్ ఆసుప‌త్రి, మాసబ్‌ట్యాంక్‌లోని మ‌హ‌వీర్ ఆసుప‌త్రుల‌లో 12కోట్ల 14ల‌క్ష‌ల రూపాయ‌ల వ్య‌యంతో నైట్ షెల్ట‌ర్లను నిర్మిస్తున్న‌ట్టు డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి వివ‌రించారు. న‌గ‌రంలో బాల యాచ‌కుల‌పై కూడా స‌ర్వే నిర్వ‌హిస్తున్నామ‌ని పేర్కొన్నారు. మున్సిప‌ల్ శాఖ డైరెక్ట‌ర్ టి.కె.శ్రీ‌దేవి మాట్లాడుతూ రాష్ట్రంలోని 74 ప‌ట్ట‌ణాల్లో నిరాశ్ర‌యుల‌పై స‌ర్వే నిర్వ‌హించామ‌ని పేర్కొన్నారు. హైద‌రాబాద్‌తో పాటు ఇత‌ర ప‌ట్ట‌ణాల్లో 16 నైట్‌షెల్ట‌ర్ల నిర్మాణం పురోగ‌తిలో ఉన్నాయ‌ని తెలిపారు. ఈ స‌మావేశంలో క‌మిటీ స‌భ్యులు ఢిల్లీ జుడీషియ‌ల్ స‌ర్వీస్ రిటైర్డ్ అదికారి నీర‌జ్‌కుమార్ గుప్త‌, కేంద్ర ప్ర‌భుత్వ ప‌ట్ట‌ణ పేద‌రిక నిర్మూల‌న విభాగం సంయుక్త కార్య‌ద‌ర్శి సంజ‌య్‌కుమార్‌, జీహెచ్ఎంసీ అడిష‌న‌ల్ క‌మీష‌న‌ర్ భాస్క‌రాచారి, పుర‌పాల‌క శాఖ అధికారులు అనురాధ‌, వంద‌న్‌కుమార్‌ల‌తోపాటు జ‌ల‌మండ‌లి ఎస్‌సి డెవ‌ల‌ప్‌మెంట్, సివిల్ స‌ప్ల‌యిస్ శాఖ‌ల అధికారులు, స్వ‌చ్ఛంద సంస్థ‌ల ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow