అతావుల్లా తండ్రి విజ్ఞప్తికి చ‌లించి పోయిన మంత్రి కేటీ రామారావు

Spread the love


ఫోటోగ్రఫి అంటే ఇష్టం. క్రికెట్ అంటే ఆసక్తి. చదువులో ఫస్ట్. వీటన్నింటికి మించి ర్యాప్ మ్యూజిక్ లో రాక్ స్టార్. ఏదో సాధించాలని ఉంది. అవకాశాలన్నింటిని అందుకోవాలని ఉంది. కాని కదల్లేడు. కుర్చీకే పరిమితం. శరీరం సహకరించదు. ఆర్థికంగా అంత స్థోమత లేదు. అయితేనేం కలలన్నింటిని సాకారం చేసుకోవాలనుకున్నాడు హైదరాబాద్ చింతల్ కు చెందిన షేక్ అతావుల్లా. పురపాలక,ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ను కలిస్తే తన ఆశలన్నీ నెరవేరుతాయనుకున్నాడు. మంత్రి కేటీఆర్ దగ్గరకు తండ్రిని పంపించాడు. కదల్లేని తన కొడుకు ఆశలు నెరవేరే మార్గం చూపించాలన్న అతావుల్లా తండ్రి విజ్ఞప్తికి మంత్రి కేటీ రామారావు చలించిపోయారు. ఆపదలో ఉన్నవాళ్లు ‘అన్నా’ అంటే చాలు నేనున్నానని భరోసా ఇచ్చే అండ తానేనని మరోసారి రుజువు చేసుకున్నారు.
హైదరాబాద్ చింతల్ కు చెందిన షేక్ అతావుల్లాకు ఏడేళ్ల వయసులోనే ఎవరికి రాకూడని కష్టం వచ్చింది. పతంగులు ఎగరేస్తూ హైటెన్షన్ కరెంటు తీగలను ముట్టుకోవడంతో రెండు కాళ్లు, ఒక చేతిని కోల్పోయాడు. తానేం కోల్పోయాడో కూడా సరిగా అర్థం చేసుకోలేని అతావుల్లా ఆ కష్టాలకు అలవాటుపడిపోయాడు. మనసు పెట్టి చదువుకున్నాడు. మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ప్రకృతిని చదవడానికి ఫోటోగ్రఫిని ఎంచుకున్నాడు. తనను తాను సరికొత్తగా ఈ ప్రపంచానికి పరిచయం చేసుకోవడానికి ర్యాప్ మ్యూజిక్ ను సెలక్ట్ చేసుకున్నాడు. ఓ వైపు బీకాం ఫైనలియర్ చదువుతూనే ర్యాపర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఈ ఆత్మవిశ్వాసానికి ఓ అండ దొరికితే అద్భుతాలు చేయవచ్చనుకున్నాడు.
అతావుల్లా ఆశలు,ఆశయాలను తండ్రి వివరిస్తుంటే మంత్రి ముగ్ధుడయ్యారు. కాళ్లు, చేతులు లేకున్నా చదువుల్లో రాణిస్తున్న అతావుల్లా టాలెంట్ కు మంత్రి ఫిదా అయ్యారు. కదల్లేని అతావుల్లాకు ముందుగా మొబిలీటీని ఇవ్వాలనుకున్నారు. సింగిల్ బటన్ తో ఆపరేట్ చేసే లక్షా యాభై వేల రూపాయల ఎలక్ట్రానిక్ వీల్ ఛేయిర్ ను మైనార్టీ శాఖ నుంచి ప్రత్యేకంగా ఫోన్ చేసి మరీ ఇప్పించారు. మంత్రి కేటీఆర్ ఇప్పించిన బహుమతి విలువ అతావుల్లాకు బాగా తెలుసు. తన లైఫ్ ను ఎన్నడూ లేనంత ఈజీగా మార్చిన మంత్రిని వ్యక్తిగతంగా కలిసి కృతజ్ఞతలు చెప్పడానికి అదే వీల్ ఛేయిర్ లో సిఎం క్యాంప్ ఆఫీసుకు ఈ రోజు వచ్చాడు. మంత్రి కేటీ రామారావును కలిశాడు. తన కలలను మంత్రి కళ్ల ముందుంచాడు. బాగా చదువుకుని ఐఏఎస్ కావాలని ఉందని చెప్పాడు.
ఎక్కడున్నా…ఏం చేసినా భవిష్యత్తుపై బెంగ పెట్టుకోవద్దన్నారు కేటీఆర్. భవిష్యత్తులోనూ అతావుల్లాకు అండగా ఉంటానని మంత్రి భరోసా ఇచ్చారు. మంత్రిని కలవడం పట్ల అతావుల్లా కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow