వ‌రంగ‌ల్ శ్రీ భ‌ద్ర‌కాళీ ఆల‌యంలో నేటితో పూర్తైన శాకంభరీ నవరాత్రులు

Spread the love

వ‌రంగ‌ల్ శ్రీ భ‌ద్ర‌కాళీ ఆల‌యంలో నేటితో పూర్తైన శాకంభరీ నవరాత్రులు


వరంగల్‌ మహానగరంలో ప్రకృతి రామణీయకతతో భూతల మణిద్వీపంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళీ దేవస్థానములో గత 15 రోజులుగా జరుగుతున్న ‘‘రాకాంత దీక్షా’’ పూర్వక శాకంభరీ నవరాత్రులు నేటితో పూర్తయ్యాయి. ఈ రోజు 15వ రోజు ఆషాఢ శు|| పౌర్ణమి రోజున అమ్మవారిని శాకంభరిగా అలంకరించి పూజారాధనలు జరిపారు. వేలాదిమంది భక్తులు ఈ రోజు ఉదయానికే ఆలయానికి చేరుకొని అమ్మవారి దర్శనం కోసం బారులుతీరారు. ఉదయం గం|| 10-30లకు అమ్మవారి దర్శనానికి దేవస్థానం వారు అనుమతించగానే కట్టలు తెంచుకున్న ఆనందంతో గుడిలోపలికి వచ్చి శాకంభరి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకొని పులకించిపోయారు. దేవస్థానం ప్రాంగణం అంతా భద్రకాళీ శరణం మమ, శాకంభరీ మాతాకీ జై అనే నామస్మరణతో మారుమ్రోగింది. ఆలయ ఈ.ఓ. ఆర్‌. సునీత పోలీసు మరియు ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో జరిపిన ఏర్పాట్లు భక్తుల ప్రశంసలకు పాత్రమయ్యాయి. దాదాపు 30 వేలమంది అమ్మవారిని దర్శించుకున్నారు. సుమారు నాలుగు టన్నుల కూరగాయలు, పండ్లు 70 రకాలు వరంగల్‌, హైదరాబాదు, బెంగుళూరు ప్రాంతాలనుండి తెప్పించి దండలుగా చేసి అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉదయం గం|| 3-00లకు ప్రారంభమైన అలంకరణ గం|| 10-00 వరకు సాగింది. గం|| 10-30ని||లకు పూజానంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. వచ్చిన భక్తులు ఉదయం వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీమతి శ్రీరాంశౖలజ, రవ్వగీతలు చల్లని త్రాగు నీరు అందించారు.

మూర్తి రహస్యంలోని 12వ శ్లోకం నుండి 17వ శ్లోకం వరకు ఈ శాకంభరీ ఆరాధన విశేషం వివరించబడింది. ఈ శాకంభరీ దేవి నీల వర్ణం కలిగి కమలాసనముపై సుందరముగానుండి తన చేతులయందు వరిమొలకలు, పుష్పములు, ఫలములు, చిగురుటాకులు, దుంపగడ్డలు మొదలగు కూరగాయల సముదాయమును ధరించి ఉండును. ఈ శాక సముదాయములు అంతులేని కోరికలను తీర్చు రసములు గలవై జీవులకు కలుగు ఆకలి దప్పి మృత్యువు, ముసలితనము, జ్వరము మొదలగువానిని పోగొట్టును. ఈ శాకంభరీదేవి శోకములను దూరము చేస్తుంది. దుష్టులను శిక్షిస్తుంది. శాంతిని కలుగజేస్తుంది. పాపములను పోగొడుతుంది. ఉమా, గౌరీ, సతీ, చంఢీ, కాళికా, పార్వతీ అనే పేర్లతో కూడా ఈ దేవి ప్రసిద్ధి పొందినది. ఈ శాకంభరీ దేవిని భక్తితో ధ్యానం చేయువారు, నమస్కరించువారు, జపించువారు, పూజంచువారు తరిగిపోని అన్న, పాణ, అమృతం అను ఫలములను అతిశీఘ్రముగా పొందుతారని పై మూర్తి రహస్యంలో తెలుపబడినది. శాస్త్రాలలో ఈ శాకంభరీ మాహాత్మ ్యం వివరింపబడి ఉండటం వలన ఈ శాకంభరీ ఆరాధన బహుళ జనాదరణ పొందినది.

శాకంభరీ అలంకరణ హన్మకొండ వాసి ప్రముఖ పవర్‌ ఇన్‌స్టలేషన్స్‌ కాంట్రాక్టర్‌ డా|| మండువా శేషగిరిరావు, రేణుక దంపతుల సౌజన్యంతో జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ తోట గణేష్‌ గారి నేతృత్వంలో 20 మంది యువకులు రాత్రి 11 గంటల నుండి ఉదయం అమ్మవారి విశ్వరూప సందర్శనం అయ్యేవరకు కూరగాయల మాలలు తయారు చేసి ఇవ్వడం తదితర సేవలందించారు. మహబూబాబాద్‌ శ్రీ వెంకటేశ్వర సేవాసమితివారు 40 మంది అమ్మవారి సన్నిదిలో భక్తులకు క్యూలైన్లలో, ప్రసాద వితరణలో సేవలందించారు. భద్రకాళీ సేవా సమితి అధ్యక్షులు అయిత గోపీనాథ్‌ ఆధ్వర్యంలో పలువురు భక్తులు దాదాపు 40 వేల మందికి భక్తులకు ప్రసాద వితరణ జరిపారు. ఈ రోజు ఆలయాన్ని సందర్శించిన ప్రముఖులలో వరంగల్‌ మేయర్‌ శ్రీ నన్నపునేని నరేందర్‌, సిటీ పోలీస్‌ కమీషనర్‌ శ్రీ జి. సుధీర్‌బాబు, వరంగల్‌ డి.ఆర్‌.ఓ శ్రీమతి శోభారాణి దంపతులు, మాజీ మంత్రి శ్రీ బస్వరాజు సారయ్య, కుడా చైర్మన్‌ శ్రీ మర్రి యాదవరెడ్డి మరియు టి.ఎన్‌.జి.ఓ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కారం రవీందర్‌ రెడ్డి, జిల్లా అధ్యక్షులు శ్రీ కోలా రాజేష్‌ గౌడ్‌ తదితరులున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow