రాష్ట్రంలో 18వేల కోట్ల వ్య‌యంతో రెండున్న‌ర ల‌క్ష‌ల‌ డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం

Spread the love

రాష్ట్రంలో 18వేల కోట్ల వ్య‌యంతో రెండున్న‌ర ల‌క్ష‌ల‌ డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం

తెలంగాణ రాష్ట్రంలో 18వేల కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో నిరుపేద‌ల‌కు డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు చేప‌ట్టామ‌ని, దేశంలోని మొత్తం 28 రాష్ట్రాల్లో గృహ‌నిర్మాణాల‌కు కేటాయించిన మొత్తం క‌న్నా తెలంగాణ రాష్ట్ర గృహ‌నిర్మాణ బ‌డ్జెట్ అధిక‌మ‌ని రాష్ట్ర మున్సిప‌ల్ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి కె.టి.రామారావు తెలియ‌జేశారు. బాగ్‌లింగంప‌ల్లి లంబాడి బ‌స్తీలో నిర్మించ‌నున్న 126 డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలకు మంత్రి కె.టి.రామారావు భూమి పూజ చేశారు. రాష్ట్ర హోం మంత్రి నాయిని న‌ర్సింహారెడ్డి ముషిరాబాద్ ఎమ్మెల్యే డా.ల‌క్ష్మ‌ణ్‌, డిప్యూటి మేయ‌ర్ బాబా ఫ‌సియుద్దీన్‌, కార్పొరేట‌ర్ వి.శ్రీ‌నివాస్‌రెడ్డిలు హాజ‌రైన ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి కె.టి.ఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుపేద‌ల ఆత్మ‌గౌర‌వాన్ని పెంపొందించేలా ప్ర‌భుత్వం చేప‌ట్టిన డ‌బుల్ బెడ్‌రూం ప‌థ‌కం దేశంలోనే వివిధ రాష్ట్రాల‌ను విశేషంగా ఆక‌ర్షిస్తోంద‌ని అన్నారు. ప్ర‌భుత్వం నిర్మించ‌నున్న రెండున్న‌ర ల‌క్ష‌ల డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల‌లో ల‌క్ష ఇళ్ల‌ను గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో నిర్మించ‌నున్నామ‌ని తెలిపారు. గ్రేట‌ర్‌లో 40వేల ఇళ్ల నిర్మాణాల‌కు టెండ‌ర్ల ప్ర‌క్రియ పూర్తి అయ్యాయ‌ని, మిగిలిన 60వేల ఇళ్ల‌కు రెండు నెల‌ల్లో టెండ‌ర్ల ప్ర‌క్రియ పూర్తిచేయాల‌ని జీహెచ్ఎంసీ అధికారుల‌ను ఆదేశించామ‌ని తెలిపారు. డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాల‌కు అవ‌స‌ర‌మ‌య్యే సిమెంట్ కేవ‌లం 230రూపాయ‌ల‌కే బ‌స్తాను అంద‌జేస్తున్నామ‌ని, అదేవిధంగా కావాల్సిన స్టీల్‌ను కూడా త‌క్కువ ధ‌ర‌కే అందించేందుకు ఆయా కంపెనీలతో సంప్ర‌దింపులు కొన‌సాగిస్తున్నామ‌ని పేర్కొన్నారు. డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపు అత్యంత పార‌ద‌ర్శ‌కంగా ఉంటుంద‌ని, ఈ విష‌యంలో ద‌ళారుల‌కు స్థానంలేద‌ని స్ప‌ష్టం చేశారు. సాగునీరు, త్రాగునీరు, సంక్షేమ‌, అభివృద్ది అనే బ‌హుముఖ నియ‌మాల‌తో ప‌లు కార్య‌క్ర‌మాల‌ను అమ‌లుచేస్తోంద‌ని అన్నారు. ఇందులో భాగంగా 5,300కోట్ల రూపాయ‌లతో 40ల‌క్ష‌ల మందికి వివిధ ర‌కాల పింఛ‌న్ల‌ను అంద‌జేస్తున్నామ‌ని వివ‌రించారు. హోం మంత్రి నాయిని న‌ర్సింహ్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో గిరిజ‌నుల‌కు ప‌ది శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను పెంచనున్నామ‌ని తెలియ‌జేశారు. జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి మాట్లాడుతూ లంబాడి బ‌స్తీలో తొమ్మిది అంత‌స్తుల్లో నిర్మించే ఈ డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నామ‌ని, దీని ద్వారా లిఫ్ట్ త‌దిత‌ర మౌలిక స‌దుపాయాల నిర్వ‌హ‌ణ‌కు అవ‌కాశం ఉంటుంద‌ని పేర్కొన్నారు. అనంత‌రం కీస‌ర మండ‌లం అహ్మ‌ద్‌గూడ‌లో 4,428 డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాల‌కు కూడా మంత్రి కె.టి.రామారావు శంకుస్థాప‌న చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Powered by Dragonballsuper Youtube Download animeshow